ఒకరు కాదు... ఇద్దరు కాదు... ముగ్గురు కాదు... నలుగురు కాదు... ఏకంగా పదిహేను మందికి పైగా కొత్త కథానాయికలు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. ‘ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా..’ అన్నట్లు గత ఏడాదితో పోల్చితే 2024లో ఎక్కువమంది తారలు పరిచయం అయ్యారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన ఆ నూతన తారల గురించి తెలుసుకుందాం.
ఒకే సినిమాతో దీపిక... అన్నా బెన్
బాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు దీపికా పదుకోన్. గర్భవతిగా ఓ డిఫరెంట్ రోల్‌తో తెలుగు ఎంట్రీ ఇచ్చారామె. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాతో మలయాళ నటి అన్నా బెన్ కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్.
డాటర్ ఆఫ్ శ్రీదేవి
దివంగత ప్రముఖ తార శ్రీదేవి తెలుగు వెండితెర, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో హిందీలో నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పట్నుంచి జాన్వీ తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అభిలషించారు. వీరి నీరిక్షణ ‘దేవర’ సినిమాతో ఫలించింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో తంగమ్ పాత్రలో నటించారామె. కల్యాణ్‌రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదలైంది. అలాగే ఇదే సినిమాతో నటి శ్రుతీ మరాఠే కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘దేవర’ సినిమాలో దేవర పాత్రకు జోడీగా శ్రుతి, వర పాత్రకు జోడీగా జాన్వీ కపూర్ నటించారు.
భాగ్యశ్రీ బిజీ బిజీ
పరభాష హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు, తొలి సినిమాకే వారి పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదు. కానీ తన తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని తన పాత్ర జిక్కీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమాలో ఓ కమర్షియల్ హీరోయిన్ రోల్ భాగ్యశ్రీకి దక్కింది. తెరపై మంచి గ్లామరస్‌గా కనిపించారు. భాగ్యశ్రీ నటన, అందానికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమె దుల్కర్ సల్మాన్, రామ్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో భాగ్యశ్రీ బిజీ.
తెలుగు తెరపై మిస్ వరల్డ్
మిస్ వరల్డ్ (2017) మానుషీ చిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఓ కమాండర్ రోల్‌లో నటించారు మానుషి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా హీరో వరుణ్ తేజ్‌కు హిందీలో తొలి సినిమా కాగా, మానుషీకి తెలుగులో తొలి సినిమా. సోనీ పిక్చర్స్, సిద్ధు ముద్దా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది.
ఎప్పుడో కాదు... ఇప్పుడే!
గత ఏడాది తెలుగులో అనువాదమైన కన్నడ చిత్రాలు ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీలో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. అప్పట్నుంచి రుక్ష్మిణి వసంత్ ఫలానా తెలుగు సినిమా సైన్ చేశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అగ్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ సడన్‌గా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదే జరిగిపోయింది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 8న విడుదలైంది. కాగా హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోని హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్‌కు దక్కిందని తెలిసింది.
ఒకేసారి మూడు సినిమాలు
ఓ హీరోయిన్ కెరీర్‌లోని తొలి మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల్వడం అనేది చిన్న విషయం కాదు. హీరోయిన్ నయన్ సారికకు ఇది సాధ్యమైంది. అనంద్ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాల్లో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి. ఇందులో ‘ఆయ్, ‘క’ సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలవగా, ‘గం గం గణేషా’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాలో నటించారు కన్నడ బ్యూటీ తన్వీ రామ్. తన్వీ ఓ లీడ్ రోల్‌లో నటించిన తొలి తెలుగు సినిమా ‘క’. ఈ చిత్రం అక్టోబరులో విడుదలైంది.
ఇటు తెలుగు... అటు తమిళం
తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాదే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ప్రీతీ ముకుందన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. హర్ష దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై, ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక కెవిన్ హీరోగా చేసిన ‘స్టార్’తో ఇదే ఏడాది తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. అలాగే మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ ఆమె హీరోయిన్‌గా చేస్తున్నారు.
ఇంకా నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో సిరీ లెల్లా, సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ చిత్రంతో అతిరా రాజీ, నవదీప్ ‘లవ్ మౌళి’తో పంఖురి గిద్వానీ, ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111’తో సంయుక్తా విశ్వనాథన్, సాయిరామ్ శంకర్ ‘వెయ్ దరువెయ్’తో యషా శివకుమార్, చైతన్యా రావు ‘షరతులు వర్తిస్తాయి’తో భూమి శెట్టి, అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’తో ప్రముఖ నటుడు జానీ లివర్ వారసురాలు జేమీ లివర్ (ఓ కీలక పాత్రతో..) తదితరులు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment