ఒడిశా: మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో కేంద్ర బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చి భారీ దాడికి దిగారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిదిమందికి పైగా బీఎస్‌ఎఫ్ జవాన్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పలువురు గాయాలపాలయినట్లు సమాచారం. బీఎస్ఎఫ్ జవాన్లతో వస్తున్న బస్సును లక్ష్యంగా ఎంచుకొని ముందాభూమి వద్ద కల్వర్ట్‌ను పేల్చివేయడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 25మంది వరకు గాయపడినట్లు సమాచారం. మృతులలో తులసి మది (డైవర్ హవిల్దార్), సోమనాథ్ సిసా(హవిల్దార్ మేజర్), సంజయ్ కుమార్ దాస్ ఉన్నట్లు గుర్తించారు.
పేలుడు ధాటికి బస్సు తునాతునకలైంది. ఈ ఘటన కారణంగా విశాఖపట్నం-రాయ్ పూర్ మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య మొదలైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత ఇంతపెద్ద స్థాయిలో మావోయిస్టులు విరుచుకుపడటం ఇదే తొలిసారి. ఆ సమయంలో పోలీసులు, కేంద్ర బలగాలు చేసిన దాడిలో 24మంది మావోయిస్టులు హతమయ్యారు.