గౌరీశ్వరరావు (పాచిపెంట)
ఆంధ్రా- ఒడిసా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి విజృంభించారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన బృందంపై విరుచుకుపడ్డారు. నలుగురు జవాన్ల ప్రాణాలు బలితీసుకున్నారు. మావోయిస్టులకు కంచుకోట లాంటి ఏవోబీ ప్రాంతం చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉంటోంది. ఇటీవలి కాలంలో పెద్దగా ఎన్కౌంటర్లు గానీ, ఎదురు కాల్పులు గానీ జరిగిన దాఖలాల్లేవు. అలాంటిది ఒక్కాసారిగా మావోయిస్టులు ఇంత స్థాయిలో దాడి చేయడం, కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన జవాన్ల ప్రాణాలు బలిగొనడం పోలీసు బలగాలకు షాకిచ్చింది.
18 మంది సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన కూంబింగ్ పార్టీ ఒడిసాలోని మల్కన్గిరి నుంచి విశాఖపట్నానికి బయల్దేరింది. నాలుగు వ్యాన్లలో వాళ్లంతా విశాఖ వెళ్తున్నారు. ఉదయం 9.30 ప్రాంతం అయ్యేసరికి ఒడిసా రాష్ట్రం సుంకి మండలం సమీపంలోని నారాయణపొదల్ గ్రామం వచ్చింది. అక్కడ మూడు వ్యాన్లు సురక్షితంగానే వెళ్లాయి. కానీ, నాలుగో వ్యాన్ వెళ్తుండేసరికి ఒక్కసారిగా మావోయిస్టులు ముందుగానే అమర్చిన మందుపాతరను పేల్చారు. అంతే.. ఒక్కసారిగా వ్యాన్ గాల్లోకి లేచింది. ఒక సబార్డినేట్ ఆఫీసర్, ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. వెంటనే భారీ సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులు దాదాపు గంట పాటు కొనసాగాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరూ కర్ణాటక, మహారాష్ట్రలకు చెందినవారు. పేలుడుకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆంబుష్ పార్టీకి చెందిన ఆయుధాలన్నీ సురక్షితంగా ఉన్నాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
అయితే... మృతులు, క్షతగాత్రుల విషయం పక్కన పెడితే, ఇదే సంఘటనలో ఇంకా చాలామంది జవాన్లు కనపడకుండా పోయారు!! ఈ విషయమే ప్రస్తుతం పోలీసు బలగాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాళ్లు కూడా మరణించారో.. లేదా అక్కడే ఏవైనా శిథిలాల కింద ఉన్నారో అనే విషయం మంగళవారం రాత్రి వరకు తెలియరాలేదు. మందుపాతర పేలిన తర్వాత ఆ సమాచారం తెలిసిన కోబ్రా దళాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. అదృశ్యమైనవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
మావోయిస్టులు మందుపాతర పేల్చిన సంఘటన నేపథ్యంలో ఏవోబీ మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సాలూరు, పాచిపెంట తదితర సరిహద్దు ప్రాంతాల పోలీసులు అలర్ట్ అయ్యారు. పేలుడు విషయమై సమాచారం అందడంతో పాచిపెంట ఎస్ఐ స్వామినాయుడు క్షతగాత్రులకు దగ్గరుండి మంచినీళ్లు పంపి, వారిని పి.కోనవలస చెక్పోస్టు వద్దనుంచి సాలూరు తీసుకెళ్లి, అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం 108 అంబులెన్సులో విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడిలో సుమారు 200 మంది మావోయిస్టులకు వరకూ పాల్గొని ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.