వాళ్లకు తెలివితేటలు తక్కువ: మార్కండేయ కట్జూ
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మరోసారి తన నోటికి పని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో చాలామందికి తెలివితేటలు తక్కువ అని వ్యాఖ్యానించారు. జడ్జీలను నియమించే కొలీజియం వ్యవస్థ గురించి కట్జు ఇటీవలి కాలంలో తరచు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీనివల్ల అవినీతిపరులు, అసమర్థులు సుప్రీంకోర్టు జడ్జీలుగా వస్తున్నారని అన్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు మీద అవినీతి ఆరోపణలు చేసి, వాటిపై విచారణ జరిపించాలని కూడా కట్జు డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థ మీద బురద చల్లారు.
''భారతీయ సుప్రీంకోర్టు జడ్జీల నేపథ్యం గురించి, వాళ్ల తెలివితేటల గురించి భారతీయులందరికీ చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్లలో కొందరికి అద్భుతమైన వ్యక్తిత్వం, మంచి పరిజ్ఞానం ఉన్నాయి.. అందుకు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ నారిమన్ లాంటివాళ్లు ఉదాహరణ. కానీ ప్రస్తుత సుప్రీంకోర్టులో ఉన్న చాలామంది జడ్జీల తెలివితేటలు మాత్రం చాలా తక్కువ'' అని ఆయన తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి కామెంట్లు చేస్తున్నందుకు కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోరా అని ఒక ఫాలోవర్ కామెంట్ రాయగా.. కోర్టు ధిక్కార విచారణలో 'నిజం' అనేది ఒక డిఫెన్స్ పాయింట్ అని చెప్పారు.