ఏరియల్ వెహికల్ ద్వారా గాలింపు: మర్రి
మండి : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రకృతి విపత్తుల నిర్వహణా సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి గురువారమిక్కడ తెలిపారు. సహాయక చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ అయిదో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
జాతీయ సముద్ర పరిశోధనా సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని, సిబ్బంది వెళ్లలేని ప్రదేశాల్లో ఏరియల్ వెహికల్ గాలింపు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. శబ్ద తరంగాలతో నీటిలో ఉన్న మృతదేహాలను కనిపెడుతుందని మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల మృతదేహాల కోసం ఇంకా సమయం పడుతోందని ఆయన అన్నారు. కాగా ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. గల్లంతు అయిన మరో 16మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.