సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు పోరాడుతున్న క్రమంలో ప్రజలు, పరిశ్రమలను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఉదారంగా ముందుకురావాలని ప్రముఖ ఆర్థిక నిపుణులు మార్టిన్ వోల్ఫ్ అన్నారు. ప్రజలు బయటకు వెళ్లి పనులు చేసుకోని పక్షంలో వారు ఇంట్లోనే కూర్చుంటారని భావించరాదని, ఆకలితో వారు మరణించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలు తమ జీవన ప్రమాణాలను కొనసాగించేలా సాయం చేసేందుకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, కోవిడ్-19 ప్రభావంతో సంక్షోభంలో కూరుకుపోయిన పరిశ్రమలకు ఊతమివ్వడం ప్రభుత్వాల రెండో ప్రాధాన్యతగా ఉండాలని సూచించారు.
కంపెనీలను ఆదుకునేందుకు బ్యాంకులు ముందుకురావాలని ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. భారత్ వంటి దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న ఆరోగ్య వనరులను పూర్తిస్ధాయిలో వినియోగించుకోవాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలకు పూర్తిస్ధాయిలో వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నారని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని, అయితే ఇది భారీ ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో భారత్‌లో ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ రుణాలు పెరిగి ద్రవ్య లోటు భారీగా పెరుగుతుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment