సాక్షి, చెన్నై: బెంగళూరు ఏరో ఇండియా షో పార్కింగ్‌లో 300 కార్లు బుగ్గిపాలైన మరుసటి రోజే చెన్నైలో అదే తరహా ప్రమాదం సంభవించింది. శివారు ప్రాంతం పోరూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి, వైద్య కళాశాల ఎదురుగా పార్కింగ్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగి 200 కార్లు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. ఆర్పకుండా పడేసిన సిగరెట్ పీక ఎండు గడ్డిపోచకు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఈ కార్లలో కొన్ని కొత్తవి, మరికొన్ని ఈఎంఐలు చెల్లించకపోవడంతో స్వాధీనం చేసుకున్నవి ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. అగ్ని కీలలు విస్తరించాక దట్టంగా కమ్ముకున్న పొగతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఏడు ఫైరింజన్లు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అన్ని కార్లలో ఇంధనం ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత భారీగా ఉండేదని భావిస్తున్నారు. పార్కింగ్ చేసి ఉన్న 216 కార్లలో 184 పూర్తిగాను, 16 పాక్షికంగాను బుగ్గిపాలయ్యాయి. రూ.50 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment