- నిబంధనలు ఉల్లంఘించానన్న
- విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు
న్యూఢిల్లీ: విమానాల్లో తానే భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. చైన్‌స్మోకర్ అయిన తాను విమానంలో ప్రయాణించేటప్పుడూ అగ్గిపెట్టెను తన వెంటే ఉంచుకుంటానని తెలిపారు. దేశంలో విమానాల్లో అగ్గిపెట్టె, లైటర్‌కు అనుమతిలేనప్పటికీ తన వెంటే తీసుకెళ్తానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విమానయాన భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సాక్షాత్తు ఆ శాఖ మంత్రి ఇలా అన్నారు.
మంగళవారమిక్కడ విమానయాన భద్రతపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రిని కాబట్టి విమానాశ్రయంలో ఎవరూ తనిఖీ చేయరని, అందువల్లే తీసుకెళ్తానని చెప్పారు. తాను మంత్రిగా లేనప్పుడు విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీచేసినప్పుడు చాలా అగ్గిపెట్టెలు, లైటర్లు పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు. అయితే విమానయాన మంత్రి అయిన తర్వాత తననెవరూ తనిఖీచేయడం లేదన్నారు. ఎల్లప్పుడూ తన జేబు లో అగ్గిపెట్టె ఉంటుందని, ఇప్పుడూ ఉందని అన్నారు. మీరు విమానంలో అగ్గిపెట్టెను ఎలా తీసుకెళ్తారన్న ప్రశ్నకు నేరుగా స్పందించకుండా.. అగ్గిపెట్టెతో ముప్పు వాటిల్లిన ప్రమాదాలున్నాయా అని తిరిగి ప్రశ్నించారు.