తప్పుగా కాదు...కావాలనే అలా రాశా..
గుజరాత్: 'ఏనుగు' ఓ మంత్రిగారిని విమర్శలపాలు చేసింది. ఇంతకీ మంత్రివర్యులు చేసిన తప్పేంటనుకున్నారా? ఇంగ్లీష్లో ఏనుగు స్పెల్లింగ్ తప్పుగా రాయటమే. దీంతో అయ్యగారి పరిజ్ఞానానికి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన శాల ప్రవేశోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, రవాణా శాఖ మంత్రి శంకర్ చౌదరి దీసలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఐక్యూను తెలుసుకునేందుకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ను బ్లాక్బోర్డుపై రాశారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన ELEPHANTకు బదులు ELEPHENT అని రాశాడు. 'A' బదులు 'E' రాశారు. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ అయింది.
దీంతో మంత్రి పరిజ్ఞానంపై ట్విట్టర్, ఫేస్బుక్లో ఓ రేంజ్లో జోక్లు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలపై స్పందించిని మంత్రి శంకర్ చౌదరీ... తప్పు ఒప్పుకోకపోగా పైపెచ్చు పిల్లల పరిజ్ఞానం తెలుసుకునేందుకే స్పెల్లింగ్ తప్పుగా రాసినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఎంబీఏ చదివిన శంకర్ చౌదరి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పు రాయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కాగా రాన్‌ధాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన శంకర్ చౌదరి నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఇక 2012లోనూ శంకర్ చౌదరిపై గుజరాత్ అసెంబ్లీలో ఐపాడ్లో అశ్లీల దృశ్యాలు చూశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం మంత్రి ఐపాడ్లో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది.