ఇలాచేస్తే.. వారం రోజులు మాంసం తాజాగా ఉంటుంది
చండీగఢ్: మేక, గొర్రెను కోసిన తర్వాత దాని మాంసం ఆరు గంటలు మాత్రమే బయటి వాతావరణంలో తాజాగా ఉంటుంది. దాన్నే ఫ్రిజ్‌లో భద్రపరిస్తే రెండు రోజులపాటు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత కుళ్లిపోతుంది. రెండు రోజులకన్నా ఎక్కువ సేపు మాంసాన్ని భద్రపర్చాలంటే దానికి రసాయనాలను పూయక తప్పదు. రసాయనాల మిశ్రమం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. ఎలాంటి రసాయనాలు పూయకుండా మరి ఎక్కువ రోజులపాటు మాంసాన్ని భద్రపర్చాలంటే ఏం చేయాలి? సరిగ్గా ఇదే దిశగా హర్యానాలోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు చెందిన జంతు ఉత్పత్తుల విభాగం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి విజయం సాధించారు. మాంసాన్ని పొరలుగా కట్‌చేసి దానిమ్మ తొక్క నుంచి తీసిన యాంటీఆక్సిడెంట్లను ఎక్కిస్తే ఆ మాంసం ఫ్రిజ్‌లో పెట్టకపోయినా మామాలు ఇంటి ఉష్ణోగ్రతలో వారం రోజులపాటు తాజాగా ఉంటుందని తేలింది. బ్యాక్టీరియాను సమర్థంగా ఎదుర్కొనే ఫ్లవొనాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు దానిమ్మ తొక్కలో ఉంటాయి.
దానిమ్మ తొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పటికే పరిశోధకులు కనిపెట్టారు. దానిమ్మ తొక్క పొడిని ఔషధంగా వాడినట్లయితే మధుమేహాన్ని నియంత్రించవచ్చని, గుండె జబ్బులను, కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సరిహద్దు ప్రాంతాల్లో, మంచు పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు తాజా మాంసాన్ని చేరేవేసే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సాధారణంగా సైనిక బేస్ క్యాంపులకు చేరేవేసే మాంసాహారం దూరప్రాంతాల్లో ఉన్న సైనికుల వద్దకు చేరేసరికి మూడు, నాలుగు రోజులు గడిచి చెడిపోతోంది. ఒక్క గొర్రె, మేక మేంసాన్ని తాజాగా ఉంచేందుకే కాకుండా కోడి, పంది మాంసాన్ని తాజాగా ఉంచేందుకు కూడా దానిమ్మ పండు తొక్కలు ఉపయోగపడతాయని వారు తెలియజేశారు.