లక్నో: మత వివక్షకు పాల్పడ్డ ఆసుపత్రి యాజమాన్యం తన తప్పు తెలుసుకుని క్షమాపణలు తెలిపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో వాలంటీన్ క్యాన్సర్ ఆసుపత్రి శుక్రవారం నాడు వివాదాస్పద ప్రకటన చేసింది. తమ ఆసుపత్రికి వచ్చే ముస్లిం రోగులు, వారి సంరక్షకులు కరోనా వైరస్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలంది. ఎంత ఎమర్జెన్సీ అయినప్పటికీ ముందుగా పరీక్షలు చేయించుకున్న తర్వాతే చికిత్స అందిస్తామంది. ఈ పరీక్షలకు ప్రతి ఒక్కరు రూ.4500 చెల్లించాలని కోరింది. అయితే ఆస్పత్రికి చెందిన ముస్లిం వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నుంచి మాత్రం రుసుము వసూలు చేయబోమని తెలిపింది. (‘పాకిస్తాన్ వెళ్లిపోండి!’)
ఈ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వస్తేనే తమ ఆసుపత్రిలో చేర్చుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పత్రికలో ప్రకటన ఇచ్చింది. ఇందులో తబ్లిగి జమాత్ సభ్యుల ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సైతం ప్రస్తావించింది. అయితే మత వివక్షను వెల్లగక్కుతూ పత్రికలో ఇచ్చిన యాడ్‌పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. దీంతో శనివారం నాడు సదరు ఆసుపత్రి యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమ ప్రకటన కొందరి మనోభావాలను కించపరిచినందున క్షమాపణలు కోరుతున్నట్లు పత్రికలో మరో యాడ్ ఇచ్చింది. ఈ సందర్భంగా అన్ని మతాలవారు కలిసికట్టుగా కరోనాపై పోరాడాలని పిలుపునిచ్చింది (ఒక్కరోజులో 1,324 పాజిటివ్ కేసులు )
Comments
Please login to add a commentAdd a comment