ప్రాణాలతో లేకున్నా.. కనీసం శవాలనైనా తీసుకురండి! | Meghalaya Trapped Workers In Mine Families Hope For They May Get Even The Dead Bodies | Sakshi
Sakshi News home page

కనీసం వారి శవాలనైనా చూపించండి చాలు!

Published Thu, Jan 3 2019 11:04 AM | Last Updated on Thu, Jan 3 2019 4:12 PM

Meghalaya Trapped Workers In Mine Families Hope For They May Get Even The Dead Bodies - Sakshi

గనిలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాల ఆవేదన (కర్టెసీ : న్యూస్‌18)

వాళ్లంతా నిరుపేదలు... మూటలు మోస్తూ, రిక్షా తొక్కుతూ జీవనం సాగించే సాధారణ కూలీలు... రోజంతా కష్టపడినా వంద రూపాయలకు మించి సంపాదించలేరు... అటువంటి అసహాయులకు ఒక్కరోజు కష్టానికే రూ. 2 వేల వేతనం చెల్లిస్తానంటూ ఆశ చూపాడో ఓ వ్యాపారి. అతడి మాటలు నమ్మిన ఆ బడుగు జీవులు తమ బతుకులు బాగుపడతాయని భావించారే తప్ప... తమ జీవితాలు ఇరుకైన ర్యాట్‌హోల్‌లో చిక్కుకొని ‘నీళ్ల’పాలు అవుతాయని ఊహించలేకపోయారు. 21 రోజులైనా సదరు బొగ్గు కార్మికుల జాడను కనుక్కోలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలిస్తే... ప్రాణాలతో కాకపోయినా సరే వారి చివరిచూపు దక్కినా తమకు కాస్త ఊరటగా ఉంటుందంటూ బాధితుల కుటుంబాలు రోదిస్తున్న తీరు మానవత్వమున్న ప్రతి ఒక్కరి మనస్సును ద్రవింపజేస్తోంది.

జాడ ఇంకా తెలియరాలేదు
మేఘాలయలోని జయంతియా కొండల్లోని తవ్వుతున్న అక్రమ గనిలో బొగ్గు వెలికి తీసేందుకు వెళ్లి గల్లంతైన 15 మంది కార్మికుల కోసం... 15 మంది గజ ఈతగాళ్ల బృందం, 10 శక్తివంతమైన కిర్లోస్కర్‌ మోటార్లు(నీటిని తోడే యంత్రాలు) అక్కడికి చేరుకుని ఇప్పటికి దాదాపు వారం రోజులైంది. అయినప్పటికీ వారి జాడ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. నేటివరకు (బుధవారం) ఆరుగంటలకోసారి 7.20 లక్షల లీటర్ల నీటిని తోడుతున్నామని రక్షణా బృందాల అధికార ప్రతినిధి తెలిపారు. గనిలో ఎండిపోయిన చెక్క నిర్మాణాలు అడ్డుగా ఉండటం వలన ఈతగాళ్లకు ఆటంకం కలుగుతోందని.. ఈ నేపథ్యంలో గురువారం నాటికి కోల్‌ ఇండియాకు చెందిన శక్తిమంతమైన సబ్‌మెర్సిబుల్‌ పంపులు అందుబాటులోకి తెచ్చి నిమిషానికి 500 గ్యాలన్ల చొప్పున నీటిని తోడి సహాయక చర్యలు వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.

ఎన్‌జీటీ ఉత్తర్వులు.. యథావిధిగా అక్రమాలు
జాతీయ బొగ్గు ఉత్పత్తిలో ఈశాన్య రాష్ట్రం మేఘాలయ వాటా పది శాతం. చాలా ఏళ్లుగా ఆ రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరు బొగ్గే. కానీ శాస్త్రీయత లోపించిన మైనింగ్‌ ప్రక్రియను చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకునేవరకూ తవ్వకాలు ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) ఉత్తర్వులివ్వడంతో చట్టబద్ధమైన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అక్రమ మైనింగ్‌ వ్యాపారులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ బొగ్గు నిల్వలు బాగా లోతున నిక్షిప్తమై ఉండటంతో.. వాటిని వెలికి తీయ డానికి ఎలుక కలుగు(ర్యాట్‌హోల్స్‌)ను పోలిన గుంతను నిలువుగా తవ్వుతారు. బొగ్గు కనిపించాక అక్కడి నుంచి సొరంగాలు ఏర్పాటు చేసి బొగ్గు తీస్తారు. ఈ కలుగులన్నీ నదీ తీరానికి సమీపంలోనే ఉండటం వల్ల నదులు పొంగినప్పుడల్లా వీటిల్లోకి నీరు ప్రవేశిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబరులో గనిలోకి భారీగా నీరు చేరడంతో.. అందులోకి దిగిన 90మంది సురక్షితంగా బయటకు రాగలిగారు గానీ 15మంది మాత్రం చిక్కుకు పోయారు.

శవాలు దొరికినా చాలు..
ప్రస్తుతం గనిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది పశ్చిమ గారో హిల్స్‌ జిల్లాకు చెందిన వారే. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి ఆ అక్రమ గనిలో ఇరుక్కున్న తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ... ‘ ఆ గనికి చెందిన సర్దార్‌ నా కుమారుడు(18), సోదరుడు(35), అల్లుడి(26)కి పని ఇప్పిస్తానని చెప్పాడు. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల కూలీ వస్తుందని ఆశ చూపాడు. దాంతో వాళ్లు ఆ గనిలోకి దిగారు. ఐదురోజులపాటు అక్కడ పనిచేశారు. సురక్షితంగానే ఉన్నారు. కానీ ఆరో రోజు (డిసెంబరు 13) పనికి వెళ్లిన ఆ ముగ్గురు ఇంతవరకు తిరిగి రాలేదు. నా భార్య, కూతురు, ముగ్గురు మనుమలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడంలేదు’ అంటూ షోహర్‌ అలీ అనే వ్యక్తి తన కుటుంబ దుస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కిరాయిలకు ఇళ్లు చూపించి రోజుకు 200 రూపాయలు సంపాదించే నేను.. 500 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్లు చిక్కుకున్న ఆ గని దగ్గరికి ఎలా వెళ్లగలను. నా దగ్గర ప్రస్తుతం మా అందరి తిండి ఖర్చులకు మాత్రమే డబ్బులు ఉన్నాయంటూ తన దీనస్థితిని మీడియాకు వెల్లడించాడు.

క్రిష్ణ లింబూ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ.. ‘మా బావ కూడా ఆ మృత్యు కుహరంలో చిక్కుకున్నాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప అతడు బతికి ఉండే అవకాశమే లేదు. అయితే కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు శవం దొరికినా చాలు. బాధిత కుటుంబాలకు వారి కొడుకులు, మనుమలు, భర్త, తండ్రి, సోదరుల కడసారి చూపైనా దక్కాలి కదా’ అంటూ ఆవేదన వెళ్లగక్కాడు.
 
మైనింగ్‌ మాఫియా ధన దాహానికి వీరి కన్నీటి గాథ తాజా ఉదాహరణ మాత్రమే. ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌ కారణంగా వేలాది మంది కార్మికులు(ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం), నిజాయితీపరులైన కొంతమంది అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా ఎంతో బలవంతులైన మైనింగ్‌ మాఫియాను కట్టడి చేయాలని భావిస్తే రాజకీయంగా ముప్పు ఏర్పడుతుందనే భయంతో గత ప్రభుత్వాలు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వెనకుడుగు వేయడంతోనే అక్రమ వ్యాపారుల ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనేది బహిరంగ రహస్యమే.  ఏదేమైనా ప్రభుత్వ వైఫల్యం, ఆకలి కష్టాలు వెరసి ఎంతోమంది కార్మికులు వీరి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీరిలో అత్యధికులు మైనర్లే కావడం మరింత విచారకరం. ప్రస్తుతానికైతే... ఏదో ఒక అద్భుతం జరిగి ఈ ర్యాట్‌హోల్‌లో బంధీలుగా ఉన్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని ఆశిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement