శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచారం కేసులో పఠాన్‌కోర్టు వెలువరించిన తీర్పును జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది.
ఈ క్రమంలో కోర్టు తీర్పుపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి స్పందించారు. ‘ కథువా కేసులో తీర్పుతో కాస్త ఉపశమనం లభించింది. ఈ గొప్పదనమంతా.. క్రైమ్‌బ్రాంచ్ టీమ్‌ను ముందుండి నడిపించిన ఐజీపీ ముజ్‌తాబా, ఎస్‌ఎస్‌పీ జాలా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు నవీద్, శ్వేతాంబరి, లాయర్ దీపికా రజావత్, తాలిబ్‌లకే దక్కుతుంది. వీరంతా ప్రాణాలు పణంగా పెట్టిమరీ నిజాలను వెలుగులోకి తెచ్చారు. చిన్నారికి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ తీర్పును స్వాగతిస్తున్నా. ఎనిమిదేళ్ల చిన్నారికి మత్తు పదార్థాలు ఇచ్చి, పలుమార్లు అత్యాచారం జరిపి, పాశవికంగా హత్య చేసిన క్రూరులకు చట్టంలోని లోపాలు ఆయుధం కాకూడదు. హేయమైన నేరానికి పాల్పడిన వాళ్లకు కచ్చితంగా శిక్ష అమలు కావాలి అని ఆమె పేర్కొన్నారు.
ఈ శిక్ష సరిపోదు..
‘ఈ తీర్పును స్వాగతిస్తున్నా. అయితే దోషులకు జీవిత ఖైదు సరిపోదు. అంతకంటే కఠినమైన శిక్షను అమలు చేయాలి. నిందితులకు మద్దతుగా నిలిచిన కొంతమంది రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి. బాధిత కుటుంబాన్ని, పోలీసులు, లాయర్లను బెదిరించిన వారిని ఏమనాలో అర్థం కావడం లేదు’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
చదవండి : ఏదో ఒకరోజు నన్ను కచ్చితంగా చంపేస్తారు
కాగా కశ్మీర్‌లోని కథువాలో గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలికపై కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో బాధితురాలి తరఫున వాదిస్తే చంపేస్తామని బెదిరింపులు రావడంతో..ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో దీపికా సింగ్ రజావత్ చిన్నారి తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. అయితే నిందితులకు కొంతమంది బీజేపీ నాయకులు మద్దతు తెలపడం, ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు చెలరేగడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment