కశ్మీర్ పీఠంపై మెహబూబా | Mehbooba Mufti sworn in as first woman Chief Minister of Jammu & Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్ పీఠంపై మెహబూబా

Published Tue, Apr 5 2016 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

కశ్మీర్ పీఠంపై మెహబూబా

కశ్మీర్ పీఠంపై మెహబూబా

రాష్ట్ర తొలి మహిళా సీఎంగా ప్రమాణం 
డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత నిర్మల్

జమ్మూ: దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణానంతరం జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన మూడు నెలల రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. ఆయన కుమార్తె, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ(56) రాష్ట్ర తొలి మహిళా సీఎంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సైదా అన్వరా(1980లో అస్సాం సీఎం) తర్వాత దేశంలో ముస్లిం మహిళా సీఎంగా 56 ఏళ్ల మెహబూబా చరిత్రకెక్కారు. ఆమె జమ్మూకశ్మీర్‌కు 13వ సీఎం. బీజేపీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా తిరిగి అదే పదవిని దక్కించుకున్నారు.

వీరితో పాటు మొత్తం 21 మంది మంత్రులతో గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ఒకప్పటి వేర్పాటు వాది సజ్జద్ గిలానీ లోన్ కూడా ఉన్నారు. 2002లో హత్యకు గురైన పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు అబ్దుల్ గిలానీ లోన్ చిన్న కుమారుడైన సజ్జద్ బీజేపీ కోటాలో కేబినెట్ మంత్రిగా రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకలో మెహబూబా ప్రమాణం ఉర్దూలో సాగింది. దీంతో సయీద్ మరణానంతరం విధించిన 86 రోజుల రాష్ట్రపతి పాలనకు తెరపడింది. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన నిర్మల్ సింగ్ తండ్రి ఒకనాటి జమ్మూ కశ్మీర్ మహారాజా హరిసింగ్‌కు సెక్యూరిటీగా పనిచేశారు. నిర్మల్ 1988లో చరిత్రలో డాక్టరేట్ పట్టా పొందారు.  ప్రమాణం తర్వాత మెహబూబా ప్రభుత్వ కార్యదర్శులతో, మంత్రులతో భేటీ అయ్యారు. పారదర్శక, బాధ్యతాయుత పాలన అందిస్తామన్నారు. 

 పీడీపీ 9... బీజేపీ 8: గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి కేబినెట్‌లో బీజేపీ మంత్రుల సంఖ్య రెండు పెరిగి ఎనిమిదికి చేరింది. పీడీపీ గతంలో ఉన్న 11 బెర్తులను తగ్గించుకుని 9తో సరిపెట్టుకుంది. శాసన సభలో మొత్తం 27 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న పీడీపీ తమ పార్టీకి చెందిన సయ్యద్ అల్తాఫ్ బుఖారీ, జేవేద్ ముస్తఫాను కేబినెట్ నుంచి తప్పించింది. వీరితో పాటు మరో మంత్రి మొహమద్ అష్రాఫ్ మీర్ ను పదవి నుంచి తొలగించింది. అయితే బుఖారీని తొలగించినట్టు పీడీపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కొంత మంది పీడీపీ ఎమ్మెల్యేలతో కలసి బుఖారీ తిరుగుబాటుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.

అటు ప్రమాణ స్వీకారోత్సవంలో సొంత పార్టీవారే పీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్, అకాలీదళ్ నుంచి హర్‌సిమ్రత్ కౌర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రాష్ట్రపతిపాలనకు నిరసనగా కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది.

 మోదీ అభినందనలు
నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల కలలను నెరవేరుస్తూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా మెహబూబా ప్రభుత్వం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. పీడీపీ, బీజేపీల భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు.

 అభివృద్ధి దిశగా సాగాలి: కేంద్రం
నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలని కేంద్రం పేర్కొంది. అభివృద్ధిలో జాతీయ స్థాయిలో పోటీపడాలని, అందుకు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది.

తండ్రి చూపిన బాటలో...
న్యాయవాద పట్టభద్రురాలైన కశ్మీర్ సీఎం మెహబూబా 1996లో తన తండ్రి సయీద్‌తో కలసి కాంగ్రెస్‌లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో అక్కడ ఉగ్రవాదం పతాక స్థాయిలో ఉంది. 

సొంత నియోజకవర్గమైన బిజ్బేహరా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గారు. 2004లో పీడీపీ అభ్యర్థిగా దక్షిణ కశ్మీర్ నుంచి పోటీచేసి తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిం చారు. 1999లో ఒమర్ అబ్దుల్లా చేతిలో పరాజయం పొందారు.

కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడానికి ఏదో ఒకటి చేయాలన్న సయీద్ తపనకు తగ్గట్టుగా 1999లో పీడీపీ ఆవిర్భవించింది. ఆ సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల నుంచి అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తెచ్చుకున్నారు.

పార్టీ అభివృద్ధిలో మెహబూబాదే కీలక పాత్ర. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ముఖ్యంగా యువతతో మమేకమవుతూ తండ్రిని మించిన తనయగా కీర్తి పొందారు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్లోని మహిళల ఇంటికెళ్లి ఓదార్చి, పిల్లలను అక్కున చేర్చుకున్నారు. ఫలితంగా 2002 ఎన్నికల్లో 16 స్థానాలను పీడీపీ దక్కించుకుంది.

అమర్‌నాథ్ భూవివాదం నేపథ్యంలో ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో భాగస్వామ్యపక్షంగా ఉన్న పీడీపీ మద్దతు విరమించుకుంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ 21 స్థానాలు నెగ్గినా ప్రతిపక్షంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు.

ప్తిపక్ష పార్టీ నాయకురాలిగా ఆమె ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలుస్తూ సమర్థవంతమైన పాత్ర పోషించారు. దాని ఫలితంగానే 2014 లోక్‌సభ ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు సాధించింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 28 స్థానాలు గెలుచుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెహబూబాకు ఇద్దరు కుమార్తెలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement