‘సంక్షేమానికి’ ఆధార్ తప్పనిసరి చేయొద్దు
లోక్‌సభలో బిల్లుపై చర్చలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పంపిణీకి ఆధార్ కార్డును తప్పనిసరి చేయరాదని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం లోక్‌సభలో ఆధార్ బిల్లు-2016పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది కూలీలు.. ముఖ్యంగా బీడీ కార్మికులు, గని కార్మికుల సహజమైన వృత్తికారణంగా వారి బయోమెట్రిక్ గుర్తులను సేకరించడం సాధ్యపడదని తెలిపారు.
ఈ పరిస్థితులను గమనించి ఆధార్‌ను తప్పనిసరి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులను పంపితే మళ్లీ ఆధార్ కార్డు రావడం లేదన్నారు. దీంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సులువుగా ఆధార్ కార్డు పొందడం, మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు.