మెట్రో జర్నీ.. క్యాంటీన్ మీల్స్.. | Metro journey.. canteen meals | Sakshi
Sakshi News home page

మెట్రో జర్నీ.. క్యాంటీన్ మీల్స్..

Published Sun, Dec 29 2013 1:34 AM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

మెట్రో జర్నీ.. క్యాంటీన్ మీల్స్.. - Sakshi

మెట్రో జర్నీ.. క్యాంటీన్ మీల్స్..

న్యూఢిల్లీ: వీఐపీ సంస్కృతిని అంతం చేయడానికి పెద్దపీట వేస్తామంటూ సరికొత్త రాజకీయాలకు తెరతీసిన కేజ్రీవాల్.. దాన్ని ఆచరణలోనూ పాటిస్తున్నారు. ఇప్పటికే జెడ్ కేటగిరీ భద్రతను, ప్రభుత్వ బంగళాను తిరస్కరించిన ఆయన ప్రమాణ స్వీకారం రోజున కూడా హంగూ ఆర్భాటం లేకుండా ఓ సామాన్యుడిలా మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. కౌశాంబి నుంచి భారకాంబ రోడ్డు వరకు మెట్రో రైల్లో వచ్చి, అక్కడ్నుంచి సొంత కారులో రామ్‌లీలా మైదానానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అదే కారులో రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముని సమాధి వద్ద నివాళులు సమర్పించారు. అనంతరం సచివాలయానికి వెళ్లారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సచివాలయం నుంచి భద్రతను తొలగించారు. సచివాలయంలోని క్యాంటీన్‌లో సిబ్బందితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

కేబినెట్ తొలి సమావేశంలో కూడా వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికే నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులుగానీ, అధికారులు గానీ ఎర్రబుగ్గ కార్లు ఉపయగించరాదని, విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాల్లో ఉండరాదని నిర్ణయించారు. మంత్రులు, అధికారుల వెంట పీఎస్‌వో, ఎస్కార్ట్ వాహనాలు కూడా ఉండకూడదని కేబినెట్ నిర్ణయించింది. ముప్పును బట్టి మాత్రమే వారికే భద్రత కల్పిస్తారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా సచివాలయానికి చేరుకున్న కేజ్రీవాల్ బిజీ బిజీగా గడిపారు. తొలిరోజు ఆరు గంటల సేపు ఆయన తన కార్యాలయంలో పనిచేశారు. ప్రభుత్వాధికారులతోను, కేబినెట్ మంత్రులతోను సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ జలమండలి సీఈవో సహా తొమ్మిది మంది అధికారులను బదిలీ చేశారు. ఢిల్లీ జల మండలి, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీతో చర్చలు జరిపారు. మిగిలిన మంత్రులు కూడా తమ తమ విధులు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, భద్రతను స్వీకరించాల్సిందిగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ను మరోసారి కోరినా, ఆయన అందుకు నిరాకరించారు.

 జనవరి 2న కేజ్రీవాల్ బల నిరూపణ

 కేజ్రీవాల్, జనవరి 2న మెజారిటీని నిరూపించుకోనున్నారు. కొత్త అసెంబ్లీ తొలి సమావేశాలు జనవరి 1 నుంచి 7 వరకు జరగనున్నాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుందని, జనవరి 2న ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుందని, అదేరోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఎన్నిక జరుగుతుందని, జనవరి 6న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనున్నారని ఒక అధికార ప్రకటనలో వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement