
960 మంది విదేశీయుల టూరిస్టు వీసాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధానిలో మర్కజ్ నిర్వహించిన ఘటనపై ప్రభుత్వం తబ్లిగీ జమత్, నిజాముద్దీన్‌లపై కఠిన చర్యలు చేపట్టింది. ప్రార్ధనలకు హాజరైన 960 మంది విదేశీయులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో పాటు వారి టూరిస్ట్ వీసాలను రద్దు చేసింది. విదేశీయుల చట్టం 1946, విపత్తు నిర్వహణ చట్టం-2005 నిబంధనలను ఉల్లంఘించిన 960 మంది విదేశీయులపై చట్టబద్ధ చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులు, డీజీపీని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగ్ జమత్ సమ్మేళనం నిర్వహించిన తర్వాత ఈ ప్రాంతం కరోనా హాట్‌స్పాట్‌గా మారిన క్రమంలో హోంశాఖ ఈ చర్యలు చేపట్టింది. కాగా 9000 మంది తబ్లిగి జమత్ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఇప్పటివరకూ క్వారంటైన్‌కు తరలించామని హోం శాఖ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 2000 మంది తబ్లిగి జమత్ సభ్యుల్లో 1804 మందిని క్వారంటైన్‌కు తరలించామని, వారిలో 334 మంది వైరస్ అనుమానితులను ఆస్పత్రులకు తరలించామని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటగా 53 మంది మరణించారు.