మౌలానా సాద్ కందల్వీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్ కందల్వీ తన అనుచరులను కోరారు. కరోనాతో పోరాటం చేసేవారికి రక్తంలోని ప్లాస్మా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తనతోపాటు మర్కజ్ ప్రార్థనలకు హాజరైన కొంతమంది స్వీయ నిర్భందంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా స్వీయ నిర్భందంలో ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చిందని మౌలానా సాద్ తెలిపారు. ఇక పాజిటివ్‌గా వచ్చిన వారికి కూడా సరైన చికిత్స అందించగా వారు కోలుకున్నారని ఆయన వెల్లడించారు. (తబ్లిగీ నేతపై ఈడీ కేసు)
కరోనా నుంచి కోలుకున్నవారు తమవంతు సాయంగా ప్రస్తుతం వైరస్ బారినపడి పోరాడుతున్న వారికి.. రక్తంలోని ప్లాస్మాను దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వచ్చే రంజాన్ మాసంలో ముస్లింలు ఇంటి వద్దనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేయాలని కోరారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మౌలానా ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. (కొత్తగా 1,300 కరోనా కేసులు, 50మంది మృతి)
కాగా దేశంలో ఇప్పటివరకూ మొత్తం 19,984 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 640 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక‍్టివ్ కేసులు 15,474 ఉన్నాయి. ఇక 3,870 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (పరమౌషధం కానున్న ప్లాస్మా!)
Comments
Please login to add a commentAdd a comment