
కార్మికుల కనీస పెన్షన్ ఇక నెలకు రూ. వెయ్యి
న్యూఢిల్లీ: వ్యవస్థీకృతరంగ కార్మికుల నెలవారీ పింఛన్ ఇక కనీసం రూ.వెయ్యి కానుంది. ఉద్యోగుల పెన్షన్ పథకం-1995 పరిధిలోని పెన్షన్‌దారుల కనీస పింఛన్‌ను రూ.1000 చేస్తూ నోటిఫై చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రూ.1000 కన్నా తక్కువ పెన్షన్ పొందుతున్న దాదాపు 28 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. ఇంతకుముందు పెన్షన్ పథకాల అర్హుల వేతన పరిమితి రూ.6,500గా ఉండేది. దీన్ని రూ.15 వేలకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు.
వ్యవస్థీకృత రంగ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిర్ణయంతో ఖజానాపై అదనంగా పడబోయే భారాన్ని భరించేందుకు బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈపీఎఫ్‌వో తన చందాదారులందరికీ ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఒకే పీఎఫ్ నంబర్(యూనియన్ అకౌంట్ నంబర్) అందజేస్తుందని తెలిపారు. దీని ద్వారా కార్మికులు/ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు వారి భవిష్య నిధి ఖాతాలను మార్చుకోవడంలో ఇబ్బందులు తప్పనున్నాయి