సైనిక పరికరాలను పరిశీలిస్తున్న రక్షణ మంత్రి నిర్మల. చిత్రంలో ఆర్మీ చీఫ్ రావత్
శ్రీనగర్: కశ్మీర్‌లో భారత్– పాక్ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి బీఎస్‌ఎఫ్ జవాన్లు పహారా కాస్తున్న భారత ఫార్వర్డ్ పోస్టులను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఎల్‌వోసీ వెంట ఉగ్రవాదుల చొరబాట్లను విజయ వంతంగా నిలువరించిన ఘటనలను సైన్యాధికారులు ఆమెకు వివరించారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం నేరుగా కుప్వారా సెక్టార్‌లోని సరిహద్దు పోస్టులను సందర్శించారు.
బదామీ బాగ్ కంటోన్మెంట్‌లో ఉగ్రచొరబాట్లను నిలువరించిన తీరు, ఉగ్రవ్యతిరేక చర్యలను ఆర్మీ కమాండర్ ఆమెకు వివరించారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ఆమె కశ్మీర్ లోయ వెంట సరిహద్దు ప్రాంతాలు, లడఖ్ ప్రాంతంలో వాస్తవాధీనరేఖ వెంట భద్రత పరిస్థితులను ఆమె సమీక్షించనున్నారు.