సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీ ఇంకా మలుపులు తిరుగుతూనే ఉంది. మిస్టరీనీ చేదించేందుకు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్, అపోలో యాజమాన్యం మధ్య పోరు సాగుతోంది. విచారణ కమిషన్‌ను అపోలో అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, అడ్డుకునే చర్యల వెనుక దురుద్దేశం, వాస్తవాలను దాచిపెట్టే ధోరణి దాగి ఉందని కమిషన్ ఆరోపిస్తోంది. అన్నాడీఎంకేను 2011 ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చిన జయలలిత ఆ తరువాత 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయభేరీ మోగించారు. అయితే సీఎం అయిన కొద్ది నెలలకే దురదృష్టవశాత్తు అస్వస్థతకులోనై అదే ఏడాది సెప్టెంబరు 22న అపోలో ఆస్పత్రిలో అడ్మిటయ్యారు.
కేవలం జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న ఆమె కొద్దిరోజుల్లోనే డిశ్చార్జి అవుతారని అపోలో వైద్యులు ప్రకటించారు. అన్నాడీఎంకే నేతలు సైతం అదే విషయాన్ని ప్రచారం చేశారు. అయితే అందుకు విరుద్ధంగా అదే ఏడాది డిసెంబర్ 5న జయ కన్నుమూశారు. జయ ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదన్నట్లుగా సాక్షాత్తు అపోలో వైద్యులే చెప్పినప్పుడు ఆమె ఎలా మరణించారని అందరూ అనుమానించారు. పైగా జయను చూసేందుకు ఎవరినీ అనుమతించకపోవడం, గోప్యం పాటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జయ మరణం ఒక మిస్టరీ అంటూ అన్నాడీఎంకేపై తిరుగుబాటు చేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సైతం ప్రకటనలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డీఎంకే డిమాండ్ చేసింది.
విచారణకు కమిషన్ నియామకం..
ఆమె మరణంపై అనుమానాలు నెలకొనడంతో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ రెండేళ్లుగా విచారణ జరుపుతున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే నేతలు, శశికళ బంధువులతో పాటు జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని కూడా పలుమార్లు విచారించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాల పనితీరుపై వైద్యులు భిన్నమైన సాక్ష్యం చెప్పారు. ఇదిలా ఉండగా విచారణ కమిషన్ తీరుపై అపోలో యాజమాన్యం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘మా ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది జయకు సంపూర్ణమైన సేవలతో సహకరించారు. జయకు అందించిన చికిత్సపై నివేదికను కమిషన్‌కు సమర్పించినా కొందరు తప్పుపడుతున్నారు. మేము సమర్పించిన నివేదికపై 21 శాఖలకు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వైద్యులు, నిపుణులతో కూడిన బృందాన్ని నియమించి పరిశీలించాలి. అప్పటి వరకు కమిషన్ విచారణపై స్టే విధించాలి. అపోలో వైద్యులకు విచారణ కమిషన్ జారీచేసిన సమన్లను రద్దు చేయాలి’ అని పేర్కొన్నారు. అయితే అపోలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 4న కోర్టు కొట్టివేసింది.
మద్రాసు హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అపోలో ఆస్పత్రి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు...జయ విచారణ కమిషన్‌పై మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అన్ని వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదికను దాఖలు చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గొగాయ్‌తో కూడిన బెంచ్‌కు ఈనెల ఒకటిన మరోసారి విచారణకు వచ్చింది. నివేదిక దాఖలుకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ప్రభుత్వ నివేదిక దాఖలయ్యే వరకు విచారణ కమిషన్‌పై గతంలో విధించిన మధ్యంతర స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
అడ్డుకోవడం వెనుక అపోలో దురుద్దేశం– ఆర్ముగస్వామి
ఇదిలా ఉండగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి సుప్రీంకోర్టులో బదులు పిటిషన్ దాఖలు చేశారు. జయ మృతిపై విచారణ సరైన దిశగానే సాగుతోందని, జయకు అందించిన చికిత్స విషయంలో అపోలో ఆస్పత్రి నుంచి ఏదైనా తప్పులు బయటపడతాయనే భయంతో ఆస్పత్రి యాజమాన్యం నిషేధాన్ని కోరుతోందని విమర్శించారు. విచారణ కమిషన్ ముందుకు వైద్యులను పంపేందుకు అపోలో నిరాకరిస్తోందని చెప్పారు. అంతేకాకుండా జయ చికిత్స విషయంలో వాస్తవాలను అపోలో దాచిపెడుతోందని పేర్కొన్నారు. విచారణ కమిషన్ యథావిధిగా కొనసాగేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. అలాగే అపోలో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని ఆర్ముగస్వామి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment