appolo
-
మహానేత వైఎస్సార్‌ను గుర్తుచేసిన అపోలో వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నాఫ్ సీఈవో సుమ్మిత్ బిదానీ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఏపీలో రోడ్, కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యాలు బాగున్నాయి. ఇన్వెస్టర్స్ సదస్సు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగం అని అన్నారు. టోరో ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగూచి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సహకారం మరువలేనిది. పలు కీలక రంగాల్లో వెంటనే అనుమతులు ఇచ్చారు అని అన్నారు. కియా ఇండియా ప్రతినిథి కబ్ డోంగ్ లి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ మద్దతు అమోఘం. రాష్ట్రాభివృద్ధికి కియా తన పాత్ర పోషిస్తోంది. అతిపెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రం ఏపీ. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిస్తోంది. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్సార్ కృషిని గుర్తు చేశారు. ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్ కృషి అభినందనీయం. ఏపీలో అపోలో కార్యకలాపాలకు పూర్తి సహకారం లభిస్తోంది. ఏపీలో సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. ఆరోగ్యశ్రీ ఇతర దేశాలకు విస్తరించింది అని అన్నారు. శ్రీ సిమెంట్ కంపెనీ ఛైర్మన్ హరిమోహన్ మాట్లాడుతూ.. ఏపీలో నైపుణ్యమైన మనవ వనరులు ఉన్నాయి. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారింది. రానున్న రోజుల్లో 5వేల కోట్ల పెట్టుబడులతో 5వేల మందికి ఉపాధి కల్పింబోతున్నామని సభా వేదికపైనే స్పష్టం చేశారు. ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీ సిమెంట్ తనదైన పాత్ర పోషిస్తుందని అన్నారు. -
మిస్టరీగానే జయలలిత మరణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీ ఇంకా మలుపులు తిరుగుతూనే ఉంది. మిస్టరీనీ చేదించేందుకు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్, అపోలో యాజమాన్యం మధ్య పోరు సాగుతోంది. విచారణ కమిషన్‌ను అపోలో అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, అడ్డుకునే చర్యల వెనుక దురుద్దేశం, వాస్తవాలను దాచిపెట్టే ధోరణి దాగి ఉందని కమిషన్ ఆరోపిస్తోంది. అన్నాడీఎంకేను 2011 ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చిన జయలలిత ఆ తరువాత 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయభేరీ మోగించారు. అయితే సీఎం అయిన కొద్ది నెలలకే దురదృష్టవశాత్తు అస్వస్థతకులోనై అదే ఏడాది సెప్టెంబరు 22న అపోలో ఆస్పత్రిలో అడ్మిటయ్యారు. కేవలం జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న ఆమె కొద్దిరోజుల్లోనే డిశ్చార్జి అవుతారని అపోలో వైద్యులు ప్రకటించారు. అన్నాడీఎంకే నేతలు సైతం అదే విషయాన్ని ప్రచారం చేశారు. అయితే అందుకు విరుద్ధంగా అదే ఏడాది డిసెంబర్ 5న జయ కన్నుమూశారు. జయ ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదన్నట్లుగా సాక్షాత్తు అపోలో వైద్యులే చెప్పినప్పుడు ఆమె ఎలా మరణించారని అందరూ అనుమానించారు. పైగా జయను చూసేందుకు ఎవరినీ అనుమతించకపోవడం, గోప్యం పాటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జయ మరణం ఒక మిస్టరీ అంటూ అన్నాడీఎంకేపై తిరుగుబాటు చేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సైతం ప్రకటనలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డీఎంకే డిమాండ్ చేసింది. విచారణకు కమిషన్ నియామకం.. ఆమె మరణంపై అనుమానాలు నెలకొనడంతో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ రెండేళ్లుగా విచారణ జరుపుతున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే నేతలు, శశికళ బంధువులతో పాటు జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని కూడా పలుమార్లు విచారించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాల పనితీరుపై వైద్యులు భిన్నమైన సాక్ష్యం చెప్పారు. ఇదిలా ఉండగా విచారణ కమిషన్ తీరుపై అపోలో యాజమాన్యం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘మా ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది జయకు సంపూర్ణమైన సేవలతో సహకరించారు. జయకు అందించిన చికిత్సపై నివేదికను కమిషన్‌కు సమర్పించినా కొందరు తప్పుపడుతున్నారు. మేము సమర్పించిన నివేదికపై 21 శాఖలకు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వైద్యులు, నిపుణులతో కూడిన బృందాన్ని నియమించి పరిశీలించాలి. అప్పటి వరకు కమిషన్ విచారణపై స్టే విధించాలి. అపోలో వైద్యులకు విచారణ కమిషన్ జారీచేసిన సమన్లను రద్దు చేయాలి’ అని పేర్కొన్నారు. అయితే అపోలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 4న కోర్టు కొట్టివేసింది. మద్రాసు హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అపోలో ఆస్పత్రి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు...జయ విచారణ కమిషన్‌పై మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అన్ని వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదికను దాఖలు చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్గొగాయ్తో కూడిన బెంచ్‌కు ఈనెల ఒకటిన మరోసారి విచారణకు వచ్చింది. నివేదిక దాఖలుకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ప్రభుత్వ నివేదిక దాఖలయ్యే వరకు విచారణ కమిషన్‌పై గతంలో విధించిన మధ్యంతర స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అడ్డుకోవడం వెనుక అపోలో దురుద్దేశం– ఆర్ముగస్వామి ఇదిలా ఉండగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి సుప్రీంకోర్టులో బదులు పిటిషన్ దాఖలు చేశారు. జయ మృతిపై విచారణ సరైన దిశగానే సాగుతోందని, జయకు అందించిన చికిత్స విషయంలో అపోలో ఆస్పత్రి నుంచి ఏదైనా తప్పులు బయటపడతాయనే భయంతో ఆస్పత్రి యాజమాన్యం నిషేధాన్ని కోరుతోందని విమర్శించారు. విచారణ కమిషన్ ముందుకు వైద్యులను పంపేందుకు అపోలో నిరాకరిస్తోందని చెప్పారు. అంతేకాకుండా జయ చికిత్స విషయంలో వాస్తవాలను అపోలో దాచిపెడుతోందని పేర్కొన్నారు. విచారణ కమిషన్ యథావిధిగా కొనసాగేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. అలాగే అపోలో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని ఆర్ముగస్వామి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
జయకు కృత్రిమ శ్వాస.. యాంటీబయాటిక్స్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఆమె కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం సీఎం జయ హెల్త్ బులెటిన్‌ను అపోలో వైద్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు జయలలితకు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు చెప్పారు. చికిత్సకు సంబంధించి యాంటీ బయటిక్స్ అందిస్తున్నామని తెలిపారు. ఇక న్యూట్రిషీయన్ సపోర్టుతో పాసివ్ ఫీజియో తెరఫీ చేస్తున్నామని వివరించారు. ఎయిమ్స్ డాక్టర్ జీ ఖిల్నానీ పర్యవేక్షణలో జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యం జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని అపోలో వైద్యులు వివరించారు. -
అపోలో చేతిలో ఇక అర్బన్ హెల్త్సెంటర్లు
– ఈ–యూపీహెచ్‌సీలుగా రూపాంతరం – వచ్చే నెల నుంచే నిర్వహణ బాధ్యతలు మదనపల్లె సిటీ : చిత్తూరులోని జిల్లా ప్రధాన వైద్యశాలను దక్కించుకున్న అపోలో కార్పొరేట్ సంస్థ ఆధీనంలోకి తాజాగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు కూడా వెళుతున్నాయి. ఈ మేరకు జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ బాధ్యతను ఆ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి అపోలో సంస్థ ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్లు నడవనున్నాయి. ఐటీ ఆధారిత సేవలతో ఈ–యూపీహెచ్‌సీలు (అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు )గా మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రి అపోలోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్జీవోలతో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ల గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 11 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో తిరుపతిలో 5, చిత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 2, మదనపల్లెలో ఒక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. మున్సిపాలిటీల్లోని మురికివాడల్లో ఉంటున్న ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు 2000వ సంవత్సరంలో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ కోసం ఆరోగ్యశాఖ టెండర్లు నిర్వహించింది. టెండర్లలో అపోలో సంస్థకు దక్కింది. దీంతో ఆ సంస్థ వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, డేటా ఆపరేటర్ల ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్లు అపోలో అప్పగించి తద్వారా వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. అయితే కార్పొరేట్ సంస్థ మురికివాడల్లో ప్రజలకు తగిన వైద్యం అందుతుందా ? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
అపోలోకు అర్బన్‌హెల్త్ సెంటర్లు
– టెలీనన్సల్టెన్సీతో స్పెషాలిటీ వైద్యం – అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): అర్బన్‌హెల్త్ సెంటర్లు ప్రముఖ కార్పొరేట్ సంస్థ అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం చేతికి దక్కాయి. వీటిని అక్టోబర్ 2 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోణహన్ను అపోలో ప్రతినిధులు కలిశారు. జిల్లావ్యాప్తంగా 20 అర్బన్‌హెల్త్ సెంటర్లు పట్టణాల్లోని మురికివాడల్లో పేదలకు ఉచితంగా ప్రాథమిక వైద్యసేవలు అందిస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు వీటిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహించేవి. ఈ సంస్థల నుంచి రెండు నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అర్బన్‌హెల్త్ సెంటర్లను స్వాధీనం చేసుకుంది. వీటి నిర్వహణ సరిగ్గా లేదన్న కారణం చూపి తెలుగుదేశం ప్రభుత్వం అపోలో హాస్పిటల్స్ యాజమాన్యానికి అప్పగించింది. ఇకపై అర్బన్‌హెల్త్ సెంటర్లను అర్బన్ పీహెచ్‌సీలుగా పరిగణిస్తారు. ఇందులో పలు రకాల వ్యాధినిర్దారణ పరీక్షలు చేస్తారు. అవసరమైతే స్పెషాలిటి వైద్యుల(అపోలో వైద్యులు)తో అర్బన్పీహెచ్సీలో ఉన్న వైద్యులు టెలి కన్సల్టేషన్ విధానంలో మాట్లాడి చికిత్స అందిస్తారు. ఈ ఆసుపత్రికి వచ్చిన రోగి హెల్త్ ప్రొఫైల్‌ను ఆధార్‌నెంబర్ ద్వారా లింక్ చేసి కంప్యూటరైజ్ చేస్తారు. తర్వాత సదరు రోగి ఎప్పుడు వచ్చినా ఆధార్ నెంబర్ ఆధారంగా వ్యాధి వివరాలు తీసి వైద్యం అందించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి శుక్రవారం అపోలో హాస్పిటల్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ అందించే సేవల గురించి వారు చర్చించినట్లు సమాచారం.