మదనపల్లె రామారావు కాలనీలోని అర్బన్ హెల్త్‌సెంటర్
అపోలో చేతిలో ఇక అర్బన్ హెల్త్‌సెంటర్లు
Published Fri, Sep 16 2016 11:53 PM | Last Updated on Mon, Oct 8 2018 8:34 PM
– ఈ–యూపీహెచ్‌సీలుగా రూపాంతరం
– వచ్చే నెల నుంచే నిర్వహణ బాధ్యతలు
మదనపల్లె సిటీ : చిత్తూరులోని జిల్లా ప్రధాన వైద్యశాలను దక్కించుకున్న అపోలో కార్పొరేట్ సంస్థ ఆధీనంలోకి తాజాగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు కూడా వెళుతున్నాయి. ఈ మేరకు జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ బాధ్యతను ఆ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి అపోలో సంస్థ ఆధ్వర్యంలో అర్బన్ హెల్త్ సెంటర్లు నడవనున్నాయి. ఐటీ ఆధారిత సేవలతో ఈ–యూపీహెచ్‌సీలు (అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు )గా మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రి అపోలోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌జీవోలతో నడుస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ల గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 11 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో తిరుపతిలో 5, చిత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 2, మదనపల్లెలో ఒక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. మున్సిపాలిటీల్లోని మురికివాడల్లో ఉంటున్న ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు 2000వ సంవత్సరంలో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ కోసం ఆరోగ్యశాఖ టెండర్లు నిర్వహించింది. టెండర్లలో అపోలో సంస్థకు దక్కింది. దీంతో ఆ సంస్థ వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, డేటా ఆపరేటర్ల ఉద్యోగాల కోసం కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్లు అపోలో అప్పగించి తద్వారా వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు. అయితే కార్పొరేట్ సంస్థ మురికివాడల్లో ప్రజలకు తగిన వైద్యం అందుతుందా ? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Advertisement
Advertisement