
మిస్ ఇండియా అనుకృతి వాస్
మిస్ ఇండియా అనుకృతి వాస్ సొంత రాష్ట్రంలో అడుగుపెట్టారు. మిస్ ఇండియా కిరీటంతో స్వగ్రామం చేరుకున్న ఆమెకు ఆప్తులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అనుకృతి వాస్ అందరితోనూ ఆనంద క్షణాల్ని పంచుకున్నారు.
సాక్షి, చెన్నై : మిస్ ఇండియాగా ఎంపికైన అనుకృతి వాస్ తమిళనాడుకు చెందిన వారే. తిరుచ్చి కోట్టూరు సరస్వతి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రశాంత్, షెలినా దంపతుల కుమార్తె ఈ అనుకృతి వాస్. ఈమెకు ఇంజినీరింగ్ చదువుతున్న సోదరుడు గౌతమ్ కూడా ఉన్నారు. అనుకృతి వాస్‌కు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి కుటుంబాన్ని వీడి ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో తల్లి షెలినా సంరక్షణలో పెరిగారు. బాల్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్యా భ్యాషం అంతా తిరుచ్చిలో సాగింది.
ఉన్నత చదువు చెన్నై లయోల కళాశాలలో బీఏ –ఫ్రెంచ్ చదువుతున్నారు. తమ బిడ్డ మిస్ ఇండియాగా ఎంపిక కావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఆప్తులు, సరస్వతి నగర్ వాసులే కాదు, సహచర విద్యార్థినులు, స్నేహితులు అను రాకకోసం ఎదురు చూశారు. అయితే, శనివారం స్వస్థలానికి ఆమె వస్తున్న సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. ఉదయాన్నే సరస్వతి నగర్‌కు చేరుకున్న అనుకృతి వాస్‌కు కుటుంబీకులు, బంధువులు, ఆప్తులు, స్నేహితులు ఆహ్వానం పలికారు. మిత్రులతో కలిసి స్వీట్లు పంచుకుంటూ అను ఆనందాన్ని పంచుకున్నారు.
చెన్నైలోనూ..
తిరుచ్చిలో కుటుంబీకులు, ఆప్తులతో ఆనందాన్ని పంచుకునేందుకు అను వచ్చిన సమాచారంతో అభిమానులు పోటెత్తారు. సరస్వతి నగర్ పరిసర వాసులు, తిరుచ్చిలోనూ పలు సంస్థలు, యువజనులు తరలివచ్చి ఆమెను అభినందించారు. అక్కడి నుంచి అనుకృతి వాస్ సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. ఇక్కడి ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను పలు సంస్థలు సత్కరించి, అభినందించాయి. కాగా, తల్లి సంరక్షణలో పెరిగినా, తన వంతుగా సామాజిక సేవను సైతం అనుకృతి వాస్ సాగిస్తుండడం విశేషం. హిజ్రాలకు విద్యను బోధిస్తున్నారు. అగ్ని అనే ప్రాజెక్ట్ ద్వారా అందరికీ విద్య లభించాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. చిన్న అనాథాశ్రమాన్ని సైతం నిర్వహిస్తున్న అనుకృతి వాస్‌ను ప్రముఖులు పొగడ్తలతో, ప్రశంసలతో ముంచెత్తారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశ్వ సుందరి కిరీటం లక్ష్యం అని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
విశ్వ సుందరి కిరీటం లక్ష్యం
విశ్వ సుందరి 2018 పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అనుకృతి తన సామాజిక సేవను, తన లక్ష్యాన్ని మీడియా ముందు ఉంచారు. 30 మంది పిల్లలతో తాను చిన్న అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సమాజంలో అందరికీ విద్య దక్కాలని, స్వయం ప్రతిభతో ప్రతి ఒక్కరూ జీవించాలన్నారు. ఇందులో భాగంగా ముప్ఫై మంది హిజ్రాలకు తన వంతు సాయాన్ని అందిస్తున్నట్టు వివరించారు. సమాజానికి తన వంతు సహకారం అందించే రీతిలో బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టు ద్వారా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామిని కలవనున్నట్టు పేర్కొన్నారు. ఇక, తన విజయానికి కారణం తల్లి అని ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఆమె ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు అని, తనను సూపర్ ఉమెన్‌గా ఆమె భావించే వారు అని తెలిపారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మహిళలు ప్రతికూల దృక్పథాన్ని వీడి అనుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని సూచించారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని, అన్నింటా జయ కేతనం ఎగుర వేయగలరని వ్యాఖ్యానించారు. కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యంతో లక్ష్య సాధనపై దృష్టిని సారించిన పక్షంలో విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. అనుకృతి వాస్ ఆదివారం నగరంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment