
టార్గెట్ భారత్!
9/11 తరహా దాడి కోసమే మలేసియా విమానం హైజాక్?
వాషింగ్టన్/కౌలాలంపూర్/న్యూఢిల్లీ: మలేసియా విమానం గల్లంతు.. తొమ్మిది రోజులుగా అంతుచిక్కకుండా అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న ఉదంతం..! విమానాన్ని హైజాక్ చేశారని, కాదు.. అది ఎక్కడో కూలిపోయిందని.. ఇలా ఎన్నో అనుమానాలు, వాదనలు.. విశ్లేషణలు! వీటికి తాజాగా ‘అల్ కాయిదా దాడి’ కోణం తోడవడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. విమానాన్ని ఉగ్రవాదులు భారత్‌పై ’9/11’ తరహా దాడి కోసం హైజాక్ చే శారని నిపుణులు అనుమానిస్తున్నారు. విమానం ప్రయాణించిన దిశ, దాని ఇంధన సామర్థ్యం, ప్రయాణ దూరం, విమాన ఆచూకీ కోసం గాలింపు జరుపుతున్న ప్రాంతాలు మొదలైనవన్నీ దీనికి బలం చేకూరుస్తున్నాయంటున్నారు.
హిందూ మహాసముద్రం దిశగా..
మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఎంహెచ్ 370 ఐదుగురు భారతీయులు సహా 239 మందితో ఈ నెల 8న మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ బయల్దేరిన గంటకే అదృశ్యమవడం తెలిసిందే. ఇది మలక్కా జలసంధి ప్రాంతంపై చివరిసారిగా రాడార్‌పై కనిపించింది. బోయింగ్‌లోని కమ్యూ నికేషన్ వ్యవస్థ, రేడియో సిగ్నళ్ల ట్రాన్స్‌పాండర్‌ను ఎవరో ఉద్దేశపూర్వకంగా స్విచాఫ్ చేసి విమానాన్ని దారి మళ్లించినట్లు మలేసియా సైనిక రాడార్ విశ్లేషణలో తేలింది. విమానాన్ని నిర్దేశిత దిశకు భిన్నంగా పశ్చిమానికి, అంటే హిందూ మహాసముద్ర దిశకు మళ్లించడం, ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్ చేసిన వ్యక్తులు విమాన ప్రయాణ వివరాలను తెలిపే బ్లాక్ బాక్స్‌నూ నాశనం చేసే అవకాశముండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే.. అల్ ఖాయిదా ఉగ్రవాదులు అమెరికాలో చేసిన 9/11 తరహా దాడిని భారత్‌లో జరిపేందుకు హైజాక్ చేసి ఉంటారనే అనుమానం కలుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ మాజీ డిప్యూటీ సెక్రటరీ, విదేశీ విధాన నిపుణుడు స్ట్రోబ్ టాల్బట్ పేర్కొన్నారు. ‘విమాన గమన దిశ, ఇంధనం, ప్రయాణ పరిధిని గమనిస్తే హైజాకర్లు ఏదో ఒక భారత నగరంపై దాడికి పథకం వేశారనే అనుమానానికి తావిస్తోంది’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బోయింగ్‌ను ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించి ఉంటే మరో ‘9/11’ దిశగా అనుమానానించాలని ఇండోనేసియాకు చెందిన స్వతంత్ర విమానయాన విశ్లేషకుడు జెర్రీ సోయెజాట్నాన్ అన్నారు.
భారత్ తీరంలోనూ గాలింపు..
విమానం భారత్ సమీప బంగాళాఖాతంలో కూలిపోయి ఉంటుందన్న అమెరికా వైమానిక నిపుణుల వాదన భారత్‌పై ‘ఉగ్రదాడి’ కుట్రకు బలమిస్తోంది. గాలింపు పరిధిని చెన్నైకి 300 కి.మీ దూరంలోని ప్రాంతానికీ విస్తరించడం, అన్వేషణలో భారత్ చురుగ్గా పొల్గొనడంఒ చూస్తే హైజాకర్లు విమానాన్ని భారత్ దిశగా తీసుకెళ్తేందుకు ప్రయత్నించారన్న అనుమానం కలుగుతోంది. ‘ఉగ్ర’కోణం బయటపడిన నేపథ్యంలో భారత్ ఆదివారం గాలింపు చర్యను నిలిపేసి ఆ దిశగా దర్యాప్తునకు సిద్ధమవుతోంది.
పైలట్ ప్రతీకారమా?
విమానం గల్లంతు వెనుక ఉగ్రకోణంతోపాటు పైలట్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం హైజాక్ అయిందనడానికి దాన్ని నడిపిన పైలట్ జహరీ అహ్మద్‌షా(53) నేపథ్యం బలమిస్తోందని నిపుణులు అంటున్నారు. 18 వేల గంటలపాటు విమానాలను నడిపిన అనుభవమున్న జహరీ మలేసియా విపక్షనేత అన్వర్ ఇబ్రహీమ్‌కు గట్టి మద్దతుదారుడు, బలమైన రాజకీయ విశ్వాసాలున్న సామాజిక కార్యకర్త. ఇబ్రహీమ్‌కు ఓ కేసులో ఈ నెల 7న మలేసియా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించినప్పుడు జహరీ కోర్టు విచారణకు హాజరయ్యాడని సమాచారం. తన అభిమాన నేతకు శిక్ష పడడంతో అతడు ఆవేశానికి లోనై, రాజకీయ ప్రతీకారం కోసం హైజాక్‌కు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్వర్‌కు శిక్షపడిన కొన్ని గంటలకే జహరీ విమానమెక్కడం గమనార్హం! అతని ఇంట్లో సోదా చేసిన పోలీసులకు విమాన నేవిగేషన్‌కు చెందిన సిములేటర్(చేతితో చేసిన అనుకరణ పరికరం)తోపాటు రెండు ల్యాప్‌టాప్‌లు దొరికాయి. సాధారణంగా ట్రైనీ పైలట్ల వద్ద ఉంటే సిములేటర్ సుదీర్ఘ అనుభవ మున్న జహరీ వద్ద ఎందుకుందనేది అంతుబట్టడం లేదు. జహరీ, అతని కోపైలట్ ఫరీక్ హమీద్‌లు తామిద్దరం కలిసి విమానం నడుపుతామని కోరలేదని మలేసియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఫరీక్ ఇంట్లోనూ సోదాలు చేశామని, అయితే అక్కడేమీ దొరకలేదని పోలీసులు చెప్పారు. కొత్త విషయాలు తెలుస్తుండడంతో విమానంలోని ప్రయాణికుల వ్యక్తిగత వివరాలను వారి బంధువులనుంచి సేకరిస్తున్నామని, ఇంతవరకు ఎలాంటి అనుమానాస్పద అంశాలూ వెలుగుచూడలేదని అన్నారు. విమానంలో ప్రయాణించిన ఐదుగురు భారతీయులకు నేరచరిత్ర లేదని భారత నిఘా వర్గాలు చెప్పాయి.
మన్మోహన్‌కు మలేసియా ప్రధాని ఫోన్
విమానం గాలింపునకు సాంకేతిక సాయం అందించాలని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ఆదివారం భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేశారు. అన్ని రకాల సాయం చేస్తామని మన్మోహన్ హామీ ఇచ్చారు. సాయం కోసం రజాక్ బంగ్లాదేశ్, కజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్ తదితర దేశాల నేతలకు కూడా ఫోన్ చేశారు. గాలింపులో పాల్గొంటున్న దేశాల సంఖ్య ఆదివారానికి 25కు చేరింది.
9/11 అనుమానాన్ని తోసిపుచ్చిన భారత్
మలేసియా విమానాన్ని భారత్‌పై 9/11 తరహా దాడికి హైజాక్ చేసి ఉండొచ్చన్న అనుమానాన్ని భారత వాయుసేనతోపాటు వైమానిక నిపుణులు కూడా తోసిపుచ్చారు. ఆ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించి ఉంటే తమ శక్తిమంతమైన రాడార్లు దాన్ని కచ్చితంగా పసిగట్టగలిగి ఉండేవన్నారు. 9/11 తరహా దాడి అనుమానాన్ని మలేసియా అధికారులు కూడా తోసిపుచ్చారు.