మిత్సుబిషి గుర్గావ్ కార్యాలయం (ఫైల్ ఫోటో)
సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగంలోంచి తీసేసారన్న అక్కసుతో ఏకంగా కంపెనీ ఉన్నతోద్యోగిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది.ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కంపెనీకి చెందిన ఉద్యోగి ఉన్నతాధికారిపై హత్యాయత్నం చేశాడు. అయితే సదరు అధికారి తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకోవడంతో కంపెనీ ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చు కున్నారు. జర్మనీ లగ్జరీ కారు మేకర్ మిత్సుబిషి కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ బినిష్ శర్మపై ఈ దాడి జరిగింది. గుర్గావ్ కార్యాలయంలో గురువారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.
గురువారం ఉదయం బినిష్ శర్మ కార్యాలయానికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన కారును అడ్డగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన కారు ఆపక పోవడమే కాకుండా వేగాన్ని మరింత పెంచారు. అయితే వెనుక కూర్చున్న వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ సంఘటనా స్థలంనుంచి పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు గాయపడిన బాధితుడిని రాక్‌లాండ్ ఆసుపత్రిలో చేర్చారు. బినిష్‌కు ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
కాగా శర్మని చంపాలనే లక్ష్యంతోనే దుండగులు కాల్పులు జరిపారని గుర్గావ్ పోలీస్ అధికారి రవీందర్ కుమార్ పిటిఐకి తెలిపారు. నిందితుల్లో ఒకరైన జోగిందర్ అనే వ్యక్తిని అనైతిక ప్రవర్తన ఆరోపణలతో బుధవారం విధులనుంచి తొలగించారని చెప్పారు. ఈ నేపథ్యంలో తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేదంటే, భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని వివరించారు. కానీ శర్మ ఆ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోలేదని అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయన బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామనీ, నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment