ఆ ఎమ్మెల్యే.. లిఫ్టులోనూ వదల్లేదు! | MLA amanatullah khan molested me in a lift too, says woman | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యే.. లిఫ్టులోనూ వదల్లేదు!

Published Mon, Sep 12 2016 6:03 PM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

ఆ ఎమ్మెల్యే.. లిఫ్టులోనూ వదల్లేదు! - Sakshi

ఆ ఎమ్మెల్యే.. లిఫ్టులోనూ వదల్లేదు!

ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎంత వెనకేసుకుని వస్తున్నా.. ఆయన మీద కేసు పీటముడి మాత్రం రోజురోజుకూ మరింత బిగుసుకుంటోంది. గడిచిన ఏడాదిన్నరలో తనమీద కనీసం ఐదుసార్లు ఆయన లైంగిక దాడి చేశాడని ఎమ్మెల్యే బావమరిది భార్య కోర్టులో వెల్లడించారు. చివరకు ఒకసారి లిఫ్టులో కూడా తనపై అఘాయిత్యం చేశాడని ఆమె తెలిపారు. తన భర్త సమక్షంలో కూడా పలుమార్లు తనవద్దకు వచ్చాడని, దీనిపై తన భర్తకు ఫిర్యాదుచేస్తే.. ఎమ్మెల్యే తనకు వ్యాపారంలో సాయం చేస్తున్నారు కాబట్టి ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవాలన్నాడని కోర్టుకు ఒక ప్రకటన ద్వారా చెప్పారు.

తనకు, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు మధ్య జరిగిన సంభాషణల రికార్డింగుతో కూడిన ఒక సీడీ, పెన్‌డ్రైవ్‌ను కూడా ఆమె పోలీసులకు ఇచ్చారు. తాను గడిచిన నాలుగు నెలలుగా భర్తతో గొడవల వల్ల ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నట్లు చెప్పారు. తాను ఇప్పటికే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశానని, కూతురిని చదివించుకోడానికి ఒక బొటిక్ నడిపించుకుంటున్నానని అన్నారు.

గత శుక్రవారం రాత్రి నుంచి ఎమ్మెల్యే మనుషులు తనను బెదిరిస్తున్నారని, అందువల్ల పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో పాటు ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌పై 354ఎ (లైంగిక వేధింపు), 506 (నేరపూరితంగా బెదిరించడం), 509 (మహిళ మర్యాదను కించపరిచే చేష్టలు, మాటలు), 120బి (నేరపూరిత కుట్ర), 498ఎ (భర్త లేదా అతడి బంధువులు మహిళపట్ల క్రూరంగా వ్యవహరించడం) సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు మాత్రం తమ ఎమ్మెల్యే చాలా మంచివాడని, నిర్దోషి అని అంటున్నారు. అతడు పార్టీ పదవులకు చేసిన రాజీనామాలను తిరస్కరించడమే కాక.. అతడికి అండగా నిలుస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పుడు కోర్టులో ఆమె వాంగ్మూలం తర్వాత ఏమంటారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement