జయమ్మకు మరో కొత్త భజన బృందం!
చెన్నై: తమిళనాడులో అమ్మ(జయలలిత) భజన ఎక్కువైంది. ఆ రాష్ట్ర అసెంబ్లీని ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు ఓ కచేరి క్షేత్రంగా మారుస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలకు బదులిచ్చే సమయంలో కొత్త పంథాను ఎంచుకునే నాడు జయలలిత నటించిన చిత్రాల్లోని పాటల్లోని కొన్ని కొన్ని పంక్తులను తీసుకొని జవాబుగా ఇస్తున్నారు. మరింత ఎఫెక్ట్గా ఉండేందుకు సంగీత వాయిద్యపరికరాలు కూడా ఉపయోగిస్తున్నారట. ఈ సన్నివేశాలు మొన్న ప్రారంభమైన 15వ తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకున్నాయి. ఈ సమావేశాలు శుక్రవారం ముగిశాయి.
అయితే, ఈ తంతు మొదలవడానికి అంతకుముందే బీజం పడింది. ఏఐడీఎంకే పార్టీ ఎంపీ ఏ నవనీత కృష్ణన్ జమ్మూకశ్మీర్ సమస్యలపై, అక్కడ ప్రజలు గత 30 రోజులుగా బయటకు రాలేకపోతున్నారనే విషయం చెప్పడానికి ముందు ఏఐడీఎంకే అధినేత ఎంజీ రామచంద్రన్ నటించిన ఇదయ వీణై చిత్రంలోని 'కశ్మీర్ అందమైన కశ్మీర్' అనే పాటను పాడి వినిపించారు. ఇదే తరహాను అందుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రసంగాలకు సంగీతాన్ని చేర్చి వినిపించాలని నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగా ఇప్పటికే ప్రయోగాలు కూడా చేశారు. ఇలా వెళితే, ముఖ్యమంత్రి జయ అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా.. వారు మాత్రం ఇదే తరహాలో అమ్మను మరింత పొగిడేస్తూ మైమరపించి పోవడం ఖాయం అంటున్నారు.