అమ్మ పార్టీకి కామ్రేడ్ల షాక్
చెన్నై: వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు సాధించడం ద్వారా ప్రధాన మంత్రి కావాలని కలలు కంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితకు వామపక్షాలు షాక్ ఇచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోరాదని వామపక్షాలు నిర్ణయించాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశాయి.
తమిళనాడులో అమ్మ సారథ్యంలోని అధికార ఏఐఏడీఎంకే పట్ల సానుకూలంగా ఉన్నట్టు కొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు పేర్కొన్నాయి. అయితే, వామపక్షాలు దూరమవడం జయలలితకు ఇబ్బందికర పరిస్థితే. వామపక్షాలు మద్దతు లేకుండా కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాల తరపున జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురావడం కష్టం. పైగా నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ దూసుకెళ్తోంది. తమిళనాడులో సినీ హీరో విజయకాంత్ పార్టీ, రాందాస్ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. తాజా రాజకీయ సమీకరణాల వల్ల అమ్మ పార్టీకి ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు దక్కకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.