చెన్నై, సాక్షి ప్రతినిధి : ‘ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించాలి. దీనిపై చైతన్యం కరువైంది. ప్రజలకు ఎంతగా చెబుతున్నా చైతన్యం కలగడంలేదు’ అని చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చైర్‌పర్సన్ డాక్టర్ శాంత ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి పట్ల భయాన్ని వీడండి, చికిత్సతో సమూలంగా నివారించవచ్చు అంటూ 1954 నుంచి తాను ప్రచారం సాగిస్తున్నానని అన్నారు. అయినా ఇప్పటికీ క్యాన్సర్ సోకితే ప్రాణాలు పోవడం ఖాయమని కొందరు భావించడం శోచనీయమన్నారు.
క్యాన్సర్ సోకిన వారెందరో చికిత్స చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తమ సంస్థ తరపున ఆగస్ట్ 2వ తేదీన నగరంలో చైతన్యసభ, 3వ తేదీన చెన్నై ఐలాండ్ మైదానం నుంచి 2కే, 4కే, 8కే రన్‌లను నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు. ఇందులో పాల్గొనేవారంతా క్యాన్సర్ బారి నుంచి బైటపడినవారేనన్నారు. తమ సంస్థకు బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో సూర్య రన్‌లో పాల్గొంటాడని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పట్ల భయం పోగొట్టేందుకు 3 నెలల పాటు బస్సుల ద్వారా గ్రామాల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నామన్నారు.
డాక్టర్ సెల్వలక్ష్మీ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పెద్దవారికి మాత్రమే వస్తుందనే అపోహ నుంచి బైటపడాలని అన్నారు. ప్రస్తుతం పుట్టిన బిడ్డకు సైతం ఈ వ్యాధి సోకుతున్నందున అనుమానం వచ్చిన వెంటనే తగిన పరీక్షలు చేసుకుని నిర్ధారించుకోవాలని చెప్పారు. క్యాన్సర్ సోకడం గత జన్మలో చేసిన పాపం అనే మూఢనమ్మకాలను పెట్టుకోరాదన్నారు. తాము నిర్వహించే రన్‌కు అందరూ ఆహ్వానితులేనని, అయితే వచ్చేనెల 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం వల్ల భద్రతాకారణాల దృష్ట్యా ముందుగా తమ పేర్లను నమోదుచేసుకోవాలని అడ్మిన్ డైరక్టర్ డాక్టర్ వసంతన్ సూచించారు. నమోదు చేసుకోని వారిని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
క్యాన్సర్‌పై చైతన్యం కరువు
Published Sat, Jul 26 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM
Advertisement