santa
-
రెండు దశాబ్దాల్లోనే మారిన దశ.. నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం
సిరిసిల్ల: గోధూళి వేళ.. వ్యవసాయ పనులు ముగించుకుని అందరూ ఇళ్లకు చేరుతున్నారు.. సూర్యుడు అస్తమించాడు.. చీకటి కమ్ముకుంటుంది.. అంతలోనే కంజీరమోతలు.. ఎర్రెర్రని పాటలు.. ఆవేశపూరిత ప్రసంగాలు.. దోపిడీలేని సమాజం కోసం విప్లవించాలనే నినాదాలు.. ప్రజాకోర్టు.. ఊరిలోని అంశాలపై బహిరంగ చర్చలు.. లాల్ సలామ్ అంటూ.. వీడ్కోలు..! మరసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు.. బూట్ల చప్పుళ్లతో ఊరు తెల్లవారింది.. ఆ పల్లెలోని వారిని ఊరు విడిచి వెళ్లకుండా కట్టడి. గ్రామ చావడి వద్దకు అందరిని చేర్చి ప్రజాదర్భార్. మేమున్నదే మీకోసం అంటూ అడవుల్లో తిరిగే వాళ్లకు మీరు అన్నం పెట్టొద్దు.. మొన్న వాళ్లకు అన్నం పెట్టిన వారు ఎవరో మాకు తెలుసు.. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం.. మీరు మాత్రం వాళ్లకు సహకరించొద్దు. చట్టం ఉందే మీకోసం.. అంటూ.. ఖాకీ డ్రెస్సుల పిలుపు..! ఇది రెండు దశాబ్దాల కిందట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కల్లా ప్ర జలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఊరు మారింది ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు, ఇప్పటి స్థితిని అంచనా వేస్తే పల్లెలు ఎంతో మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల కోనరావుపేట మండలం బావుసాయిపేటను పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆ పల్లెకు వాహనయోగం వ చ్చింది. అప్పట్లో ఊరు మొత్తంలో మూడు, నాలు గు వాహనాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇంటికో బైక్, ఊరి నిండా ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు ఇలా ఎంతో మార్పు వచ్చింది. జిల్లాలోనే అత్యధి క కోళ్ల పరిశ్రమ ఆ గ్రామంలో విస్తరించింది. 20 కోళ్ల ఫారాలతో పౌల్ట్రీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఆ ఊరిలో పట్టణాల తరహాలో సూపర్మార్కెట్లు నడుస్తున్నాయి. ఒకప్పటి కల్లోల పల్లె ఇప్పుడు ప్రశాంతంగా ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. బావుసాయిపేట ఊరి జనాభా నాలుగు వేలు. ఓటర్ల సంఖ్య 2,740, వార్డులు పది. నివాసాల సంఖ్య 876. చిన్న ఊరే అయినా అభివృద్ధిలో అగ్రపథాన నిలుస్తుంది. తీరొక్కటి దొరికే... సంత బావుసాయిపేటలో ప్రతీ బుధవారం జరిగే వారసంతలో తీరొక్క వస్తువులు దొరకుతాయి. చేపలు, రొయ్యలు మొదలు కొని బట్టలు, నిత్యసవరమైన వస్తువులు అన్నీ లభి స్తాయి. దీంతో కొండాపూర్, వెంకట్రావుపేట, బండపల్లి, గోవిందరా వుపల్లె గ్రామాల వాసులు వారసంతకు వచ్చి సరుకులు కొనుగోలు చేస్తారు. ఊరు శివారులో మూలవాగు, మరో రెండు చెరువులు ఉండడంతో భూగర్భజలాలకు కొదువ లేదు. వరి, పత్తి, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలను సాగుచేస్తారు. భూములు కొనుగోలు, విక్రయాలతో ఊరి ఆర్థికస్థితి మెరుగుపడింది. వ్యవసాయంలో బావుసాయిపేటలో అగ్రగామిగా నిలుస్తుంది. దీంతో గ్రామీణ ఆర్థికస్థితి ఎంతో బాగుపడింది. ఊరిలో రోడ్డుకు ఇరువైపులా ఉండే చెట్లు పల్లె అందాన్ని పెంచాయి. ఎంతో మార్పు వచ్చింది ఒకప్పటితో పోల్చితే ఊరిలో ఎంతో మార్పు వచ్చింది. రోడ్లు బాగుపడ్డాయి. రవాణా వసతి పెరిగింది. కమ్యూనికేషన్ పెరిగింది. ప్రజల జీవనంలోనూ మార్పు వచ్చింది. పట్టణాల్లో దొరికేవి అన్ని పల్లెల్లో అన్నీ లభిస్తున్నాయి. – బైరగోని నందుగౌడ్, చైతన్య యూత్, అధ్యక్షుడు వేగంగా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పల్లెల్లో అభివృద్ధి వేగంగా సాగుతుంది. అన్ని రంగాల్లో మార్పు వేగంగా జరిగింది. ఇంటింటా సెల్‌ఫోన్ యుగమైంది. గతంలో పోల్చితే.. పల్లె ముఖచిత్రం ఎంతో మారింది. కల్లోల పల్లెల్లో వ్యవసాయ విస్తరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. – కెంద గంగాధర్, గ్రామ సర్పంచ్ -
విరాట్ సర్ ప్రైజ్.. శాంటా తాతగా అవతారం
-
పిల్లలకు సర్ప్రైజ్ ఇచ్చిన విరాట్
క్రిస్మస్ పండగంటే చాలా మంది పిల్లలు... సాంటా తాత వచ్చి బహుమతులెన్నో పంచి పెడతాడని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి వారి కోసం సాంటా తాతలా మారిపోయాడు లెజెండరీ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఆటతో ఎప్పుడూ పుల్ బిజీగా ఉండే విరాట్ క్రిస్మస్ పండుగను ముందుగానే కొంతమంది పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాడు. సాంటా తాతలా వేషం వేసుకుని పిల్లలకు సర్ఫ్రైజ్ ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా వారికి బహుమతులు పంచిపెట్టాడు. వారితో కాసేపు సరదాగా గడిపిన విరాట్.. పిల్లలతో ముచ్చటించి సంతోషాన్ని పంచుకున్నాడు. సాంటా తాతల వేషం వేసుకున్న కోహ్లి వీడియో సోషల్ మీడియాలో వైర్‌ల్‌గా మారింది. ఈ సందర్భంగా అతన్ని పలువురు అభినందిస్తున్నారు. -
ఆ యాప్‌లో అసభ్యకర సందేశాలు!
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను ఉద్దేశించి రూపొందించిన సాంటా క్లాస్ అనే మొబైల్ యాప్ అసభ్యకర సందేశాలను పంపిస్తోంది. పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను సర్ప్రైజ్ చేయడానికి తల్లిదండ్రులకు ఓ సాధనంగా ఉండేందుకు రూపొందించిన ఈ యాప్ వారికి లేని తలనొప్పిని తెచ్చిపెడుతోంది. నార్త్ కరోలినాకు చెందిన ఓ కుటుంబం ఈ యాప్ బారిన పడి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ యాప్‌లో తన కూతురికి వచ్చిన అసభ్యకరమైన సందేశాన్ని చూసి అవాక్కైంది. అష్లే అడామ్స్ 8 ఏళ్ల కూతురు ఎంతో కుతూహలంగా ఐఓఎస్ యాప్ స్టోర్ ద్వారా ఈ సాంటా యాప్‌లోకి వెళ్లింది. ‘హాయ్’ అని టైప్ చేసింది. అయితే ఆ మెసేజ్‌కు బదులుగా వచ్చిన సందేశాన్ని చూసి నిర్ఘాంతపోయింది. హాయ్ మెసేజ్ సాంటా ఫీచర్స్ ‘నువ్వేం డ్రెస్ వేసుకున్నావ్’ అనే జుగుప్సాకరమైన సందేశాన్ని పంపించింది. ఈ సందేశం చూసి తాను షాక్ గురయ్యానని ఆ చిన్నారి తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే ఆ మొబైల్ తీసుకొని పలు ప్రశ్నలతో యాప్ పరీక్షించిన అష్లే.. యాప్ తీరుపై పోలీసులతో పాటు యాపిల్ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అయితే యాపిల్ కంపెనీ థర్డ్‌పార్టీ యాప్ అయిన సాంటాపై ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయం తెలియరాలేదు. ఇక ఆ మధ్య అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ ఇలానే బూతులు తిడుతోందని అమెజాన్‌కు ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: అలెక్సా బూతులు తిడుతోంది!) -
వైరల్ వీడియో : ఇది కలా.. నిజమా?!
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టమస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్టమస్ అనగానే టక్కున గుర్తుకొచ్చేవి.. క్రిస్టమస్ ట్రీ, స్టార్, శాంటా.. ఇంకా బోలెడన్ని బహుమతులు. అయితే వాషింగ్టన్‌లోని ఓ ఆస్పత్రిని సందర్శించిన క్రిస్టమస్ శాంటాను చూసి అక్కడున్న వారంతా ఒక్క క్షణం అవాక్కయ్యారు. తాము చూస్తున్నది కలా.. నిజమా అని పోల్చుకోవడానికి వారికి కాస్తా సమయం పట్టింది. ఎందుకంటే క్రిస్టమస్ శాంటాగా వారిని పలకరిచండానికి వచ్చింది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కావడం విశేషం. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న చిన్నారుల్లో పండగ సరదాను తీసుకురావాలని భావించిన ఒబామా, వాషింగ్టన్లో ఉన్న చిల్డ్రన్స్ నేషనల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడున్న పిల్లలను కలిసి వారితో కాసేపు ముచ్చటించి.. బోలేడన్ని బహుమతులు ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఒబామా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న నర్సులు, డాక్టర్లు, సిబ్బంది ఈ చిన్నారులను ఎంత శ్రద్దగా చూస్తారో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. నాకు సహకరించినందుకు మీ అందరికి ధన్యావాదాలు అన్నారు. ఒబామా, ఆస్పత్రిలో చిన్నారులతో మాట్లాడుతూ.. సందడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Thank you @BarackObama for making our patients’ day so much brighter. Your surprise warmed our hallways and put smiles on everyone’s faces! Our patients loved your company…and your gifts! https://t.co/bswxSrA4sQ ❤️ #HolidaysAtChildrens #ObamaAndKids pic.twitter.com/qii53UbSRS — Children's National 🏥 (@childrenshealth) December 19, 2018 -
‘సంత’ సక్సెస్ కావాలి
‘‘గ్రామీణ నేపథ్యంలో చక్కని ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తీసిన చిత్రం ‘సంత’. గోరేటి వెంకన్నగారు ఓ లెజెండ్. ఆయన ఈ సినిమాకి రాసిన పాట అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ‘సంత’ సక్సెస్ కావాలి. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ట్యాగ్ లైన్. శ్రీ జై వర్ధన్ బోయెనేపల్లి నిర్మించి న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ‘రంగస్థలం’ సెట్లో సుకుమార్ విడుదల చేశారు.ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ– ‘‘ఓ సంత నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఫీల్‌గుడ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో పాటలు చిత్రీకరించాం. షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు. కిన్నెర, మధుమణి, ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ– కథనం– సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్. -
పోలిక తేవద్దు
డాక్టర్ వి.శాంత క్యాన్సర్ స్పెషలిస్ట్. చెన్నైలోని ‘అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్’ చైర్పర్సన్. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, మెగసెసె అవార్డుల గ్రహీత. ఇవన్నీ కాదు కానీ.. వృత్తిని ఆమె ఎంత నిబద్ధతతో స్వీకరించారో వెల్లడించే ఒక చిన్న సంఘటన ఈ మధ్యే బయటికి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని నీరవ్ మోదీ అనే ఆభరణాల వ్యాపారి వేల కోట్ల రూపాయలకు మోసం చేసి, విదేశాలకు పారిపోయిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఆ బ్యాంకు ఎండీ సునీల్ మెహ్తా ఫిబ్రవరి 15న ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టారు. ‘‘ఇలాంటి మోసాలను ఇక జరగనివ్వం. సర్జరీ చేసి ఈ అవినీతి క్యాన్సర్‌ని నిర్మూలిస్తాం’’ అని అన్నారు. దీనిపై డాక్టర్ శాంతి మండిపడుతూ ఆయనకో ఉత్తరం రాశారు. ‘‘అవినీతి అనేది ఒక నేరం. సిగ్గు పడాల్సిన తప్పుడు పని. హీనమైన ఆ నేరాన్ని క్యాన్సర్‌తో ఎలా పోలుస్తారు?’’ అని ఆ ఉత్తరంలో డాక్టర్ శాంత ప్రశ్నించారు! మనసా వాచా కర్మణా వృత్తి ధర్మాన్ని నెరవేర్చేవారు తప్ప ఇంకొకరు ఈ మాట అనలేరు. డాక్టర్ శాంత వయసిప్పుడు 90 ఏళ్లు. నేటికీ ఎంతో ఉత్సాహంగా రోగులకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఓ సందర్భంలో క్యాన్సర్‌కు లేనిపోని పోలికలు తెచ్చారు అప్పుడు కూడా డాక్టర్ శాంత చెన్నైలోని యు.ఎస్.కాన్సులేట్‌కు ఘాటుగా లేఖ రాశారు. నిరాశను, నిస్పృహను, అవినీతిని, ఇంకా.. సమాజంలోని నానా రుగ్మతల్ని క్యాన్సర్‌తో పోల్చడం మామూలైపోయింది. ఇది సరి కాదు’’ అని అందులో ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా వృత్తిని ఇంతగా ప్రేమించడంవల్లనే అంతగా కోపం వస్తుందేమో! శాంత 1927 మార్చి 11న చెన్నైలోని మైలాపూర్‌లో జన్మించారు. అయ్యర్ల కుటుంబం. నోబెల్ గ్రహీతలు సీవీ రామన్, ఎస్.చంద్రశేఖర్‌లు వీళ్ల వంశవృక్షంలోని వారే. సీవీరామన్ శాంతకు నాన్నవైపు వారు. చంద్రశేఖర్.. అమ్మవైపు వారు. ‘‘అవినీతి అనేది ఒక నేరం. హీనమైన ఆ నేరాన్ని క్యాన్సర్‌తో ఎలా పోలుస్తారు?’’ – డాక్టర్ వి.శాంత -
భార్యాభర్తనాట్యం
యాభై ఏళ్ల భార్యాభర్తల బంధం! అబ్బ.. ఎంత ముచ్చటగా ఉంది! ప్రేమ కలిపింది. నాట్యం నిలిపింది. ఎ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ! నాట్యంతో మమేకమై జీవిస్తున్న దంపతులు అనగానే మనకు ఇక్కడ రాధారెడ్డి, రాజారెడ్డి గుర్తుకువస్తారు. ఆ దంపతులు కూచిపూడిని విశ్వవ్యాప్తం చేస్తుంటే, ఈ దంపతులు భరతనాట్యానికి మువ్వలుగా సందడి చేస్తున్నారు. ‘‘నేను శాంతను తొలిసారి చూసింది ‘కళాక్షేత్ర’లోని థియోసాఫికల్ గార్డెన్లో. అసలు కళాక్షేత్రలో నేను కలిసిన అమ్మాయి తనే. నాకు తమిళ్ రాకపోవడంతో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధతో నన్ను గైడ్ చేస్తుండేది. శాంతలో నాకు నచ్చిన లక్షణాలు చాలా ఉన్నాయి. తానెప్పుడూ ఏదో ఒక పనిలో ఉండేది. అయినా ముఖం మీద చిరునవ్వు చెరిగేది కాదు’’78 ఏళ్ల ధనుంజయన్ 74 ఏళ్ల శాంత గురించి చెప్పిన మాటలివి. వారిది అన్యోన్యమైన దాంపత్యం. వారి ప్రేమ అపూర్వం. వారి నాట్యరీతులు అమోఘం. యాభై ఏళ్లుగా వారిద్దరూ భరతనాట్యంలో ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. దేశవిదేశాల్లో దశాబ్దాలుగా వారి పాదాలు నర్తిస్తూనే ఉన్నాయి. ధనుంజయన్ది కేరళలోని కన్నూరు జిల్లాలో పయ్యనూర్. తండ్రి స్కూల్ టీచర్. అసలే పేద కుటుంబం, ఎనిమిది మంది సంతానాన్ని పోషించడానికి ఆయన జీతం సరిపోయేది కాదు. రెండు మూడేళ్లకోసారి బదిలీ. ఒక చోట కుదురుగా లేని బాల్యం ధనుంజయన్ది. శాంతది మలేసియాలో స్థిరపడిన మలయాళీ కుటుంబం. నాట్యంలో, గానంలో చురుగ్గా ఉండేది. భరత నాట్యమంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ఎనిమిదేళ్ల వయసులో డాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరినీ కలిపింది తమిళనాడులోని కళాక్షేత్ర నాట్యకేంద్రం. ధనుంజయన్కి భరతనాట్యం మీద ఉన్న ఆసక్తిని గమనించిన నాట్యగురువు కళాక్షేత్రకు రికమండ్ చేసి స్కాలర్‌షిప్‌తో సీటిప్పించారు. అలా ధనుంజయన్ పధ్నాలుగేళ్ల వయసులో కళాక్షేత్రలో అడుగుపెట్టారు. అప్పటికి ఓ ఏడాది ముందే శాంత.. కళాక్షేత్రలో చేరింది. నాట్య బంధం! నాట్య గురువులు చందు పణిక్కర్, రుక్మిణీదేవిల శిక్షణలో ధనుంజయన్, శాంతలు రాముడు –సీత అయ్యారు, అనిరుద్ధ– చంద్రలేఖలయ్యారు. ‘‘మా తొలి ప్రదర్శన సీతా స్వయంవరం. 1956లో కోయంబత్తూరులో ఇచ్చాం’’ అని ధనుంజయన్ గుర్తు చేసుకున్నారు. ‘ఆ నాట్యప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న స్టూల్ మీద చాలా సన్నిహితంగా కూర్చోవాల్సి వచ్చేది. అప్పుడు చాలా ఎంబరాసింగ్‌గా ఫీలయ్యాను. ఆ తర్వాత అదే స్టూల్ని ఇష్టంగా వాడేవాళ్లం’ అని గుర్తు చేసుకున్నారు శాంత. పేదరికం ప్రేమను చంపేస్తుందా? ధనుంజయన్, శాంత ఇద్దరూ భరతనాట్యం, కథాకళిలో డిస్టింక్షన్లో పాసయ్యి 1962లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. వీటితోపాటు ఆమె కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. శాంత కోర్సు పూర్తయిన తర్వాత మలేసియాకు వెళ్లిపోయారు. ధనుంజయన్కి మిగిలింది సస్పెన్సే. అప్పటికీ ఆయన తన ఫీలింగ్స్‌ని బయట పెట్టనేలేదు. తనలో మొగ్గతొడిగిన ప్రేమ.. ప్రేయసికి తెలియజేయకుండానే వడలిపోతుందా అని బెంగ. పేదరికం తన ప్రేమను చంపేస్తుందేమోనని ఆందోళన. ఇక్కడ ఇలా ఉంటే... మలేసియాలో శాంతకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు! ధనుంజయన్ని తప్ప ఎవరినీ తన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగాలేదామె. పెళ్లి చూపులు వద్దంటూ ఉండడంతో ఆమె పేరెంట్స్ అర్థం చేసుకుని ఇండియాకు వచ్చారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో 1966లో ధనుంజయన్‌కు, శాంతకు పెళ్లి చేశారు. శాంత.. భర్తతో కేరళలోనే ఉండిపోయింది, తల్లిదండ్రులు మలేసియాకి వెళ్లిపోయారు. పెళ్లి సరే... బతికేదెలా?! చేతిలో డాన్స్‌తోపాటు ఎకనమిక్స్‌లో పట్టా ఉంది. ఓ చిన్న కంపెనీలో క్లర్కు ఉద్యోగం వచ్చింది. అమ్మానాన్నలకు పంపించడానికి, తన ఇంటిని నడిపించడానికి ఒక భరోసా వచ్చింది. కానీ సంపన్న కుటుంబంలో పుట్టిన భార్యకు కనీస వసతులు కల్పించాలంటే ఆ జీతం ఏ మాత్రం సరిపోదు. అందుకే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డాన్సు క్లాసులు తీసుకునేవారు ధనుంజయన్. తాటాకు కప్పుతో చిన్న పాకలో ఆయన నాట్యగురువుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. క్రమంగా తమిళనాడుకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వారి డాన్స్ ఇన్స్టిట్యూట్ ‘భారత కళాంజలి’కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ రోజుల్లోకి వెళ్లిపోతూ, ‘‘శాంతను సంతోషంగా ఉంచడం మీదనే నా దృష్టి అంతా. వాళ్ల తల్లిదండ్రులది ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి నా కోసం వచ్చింది. ఆమె మాత్రం ఎటువంటి సౌకర్యాలనూ అడిగేది కాదు. అయినా ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు శాంతకు రాకుండా చూడడం నా బాధ్యత అన్నట్లు శక్తివంచన లేకుండా ప్రయత్నించేవాడిని. ఆమె ముందుచూపుతో మేము ఏర్పరుచుకున్న సామ్రాజ్యం ఇది’’ అంటారు ధనుంజయన్. నాట్య ప్రయోగాలు! భార్యాభర్తలిద్దరూ అప్పటి వరకు తాము నేర్చుకున్న నాట్యరూపకాలను ప్రదర్శించడంతో కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత కొత్త రూపకాలను పరిచయం చేశారు. నాట్యంలో యుగళగీతాన్ని ప్రవేశపెట్టారు. సంప్రదాయ అలరిప్పు స్థానాన్ని వారి ‘కళాంజలి’ పరిపూర్ణం చేసింది. ఆ దంపతుల అభినయం ‘నృత్యోపహారమ్’ రూపకాన్ని ఆవిష్కరించింది. వాటిని ఎల్లలు దాటించి విదేశాల్లోనూ వందలాదిగా ప్రదర్శించారు. మనదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకూ తాము రూపొందించిన కొత్త రీతులను చూపించారు. ఖజురహో ఫెస్టివల్, రాష్ట్రపతి భవన్లో... ఇలా వేలాది ప్రదర్శనలు, లక్షలాది ప్రశంసలను అందుకున్నారు. పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డుతోపాటు పదులకొద్దీ అవార్డులు వారి సొంతమయ్యాయి. ఇన్ని ప్రశంసలలో తమను అత్యంత మురిపించిన ప్రశంస అమెరికాలోని అట్లాంటాలో ఏడేళ్ల బాలుడు తమకు ఇచ్చిందేనని అంటారు. ధనుంజయన్. నాట్యమే ఊపిరి! నాట్య ప్రదర్శనలు మొదలు పెట్టి యాభై ఏళ్లు దాటినా ఇంకా ఈ దంపతులలో ఆ స్ఫూర్తి ఏ మాత్రం తరగలేదు. ‘నాట్యం చేయకపోతేనే నిస్సత్తువ ఆవరిస్తుంది. నాట్యాన్ని శ్వాసిస్తూ జీవించాం, శ్వాస ఆగే వరకు నాట్యం చేస్తూనే ఉంటాం’ అన్నారు ధనుంజయన్. ‘నాట్యంలో శిఖరాలను చూసిన ఆనందాన్ని అనంతంగా ఆస్వాదిస్తున్నాం. ఇక మేము చేయాల్సిన పెద్ద బాధ్యత ఒకటుంది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోసం పెద్ద థియేటర్ నిర్మించాలి. సాంస్కృతిక నగరం చెన్నైలో నిత్యం కొత్త కళాకారులు పుట్టుకొస్తూనే ఉంటారు. వారికి ప్రదర్శనలకు అనువుగా ఒక వేదిక కావాలి. అది పూర్తయితే భరతనాట్యానికి మా వంతుగా తిరిగి ఇచ్చిన వాళ్లమవుతాం’ అన్నారు శాంత. వొడాఫోన్ కపుల్ ధనుంజయన్, శాంత దంపతులకు సత్యజిత్ ఒక్కడే కొడుకు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. అదే రంగంలో కొనసాగాడు. కొడుకు సరదా కోసం వాళ్లు గోవాలో చిత్రీకరించిన వొడాఫోన్ అడ్వర్టయిజ్మెంట్లో నటించారు. అందులో ఈ దంపతులు సెకండ్ హనీమూన్కొచ్చిన కపుల్ అన్నమాట. అది డాన్సు ప్రధానంగా ఉన్న యాడ్ కావడంతో చేయడానికి ఒప్పుకున్నారు శాంత. ఆ తర్వాత మరో ఐదు యాడ్ ఫిల్మ్స్‌లో నటించినప్పటికీ వొడాఫోన్ యాడ్ తనకు చాలా ఇష్టమంటారు శాంత. ఆమె స్వతహాగా కూడా అడ్వంచర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడతారు. పారాసైలింగ్ ఆమె హాబీ. ఆ యాడ్‌లో ఆమె పారాసైలింగ్ చేశారు కూడా. అందుకే ఆ యాడ్‌ను అంతగా ఇష్టపడతారు. – మంజీర -
శాంతించిన గోదారమ్మ
ఊపిరి పీల్చుకున్న అధికారులు మంగపేట : ఎగువ ప్రాంతాల నుంచి వివిద జలాశయాల నుంచి విడుదల చేసిన వరదనీటిలో మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఉగ్ర రూపందాల్చి పరుగులు తీసిన గోదారమ్మ బుధవారం సాయంత్రం నుంచి తగ్గు ముఖం పట్టడంతో అధికారులు ఊపరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం నుం చి కాళేశ్వరం వద్ద వరదనీటి ఉదృతి పెరగడంతో అర్దరాత్రి వరకు గోదావరి వరదనీరు భారీగా పెరిగే అవకాశం ఉందని ముందే గ్రహించిన అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అం దించి అప్రమత్తం చేశారు. అర్ధరాత్రి నుంచి క్రమంగా పెరుగుతూ ఉదయం 7 గంటల వరకు వరద ఉదృతి భారీగా పెరగడంతో తహసీల్దార్ తిప్పర్తి శ్రీనివాస్, ఆర్ఐ అశోక్‌రెడ్డి పుష్కరఘాట్ వద్ద వరద తీవ్రతను పరిశీలించారు. ఉదృతి పెరిగే అవకాశాలు ఉండంతో మండలంలోని లోతట్టు ప్రాంతాలయిన కత్తిగూడెం, అకినేపల్లిమల్లారం, బోరునర్సాపురం వీఆ ర్వోలను అప్రమత్తం చేశారు. మద్యాహ్నం 3 గంటల నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గోదావరి వరద నీటి ఉధృతికి కోతకు గురవుతున్న ఒడ్డును చిన్ననీటి పారుదల శాఖ డిఈఈ రవికాంత్, ఈఈ రాంప్రసాద్ బుధవారం పరిశీలించారు. కాగా మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పుష్కరఘాట్‌ను సందర్శించారు. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకబస్తాలు ఏర్పాటు చేసి ఒడ్డు కోతకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మైనర్ ఇరిగేష¯ŒS అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రాత్రికి రాత్రి కూలీలతో సుమారు 100 సిమెంటు బస్తాల్లో ఇసుక నింపి ఒడ్డు వెంట ఏర్పాటు చేశారు. అయినప్పటికి బుధవారం వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఇసుక బస్తాల్లో కింద ఒండ్రు మట్టితో కూడిన ఇసుక కోతకు గురికావడంతో కొంత మేరకు ఇసుక బస్తాలు గోదావరిలోకి జారి పోయాయి. బస్తాలు జారిపోయిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. -
సైకత శాంటాక్లాజ్ కు వరల్డ్ రికార్డ్!
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం అంత సులభం కాదు. అటువంటి రికార్డు పుటలకెక్కడం కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ప్రతిభను ప్రదర్శిస్తారు. తమలోని ప్రతిభకు పదును పెట్టి మరింత నైపుణ్యంతో ప్రదర్శించి రికార్డులకెక్కుతారు. అదే నేపథ్యంలో ఇప్పటికే ప్రఖ్యాత భారతీయ సైకత కళాకారుడుగా పేరొంది... ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నసుదర్శన్ పట్నాయక్... తాజాగా అతిపెద్ద శాంటా క్లాజ్ ను అత్యంత సుందరంగా తీర్చి దిద్ది ప్రపంచ రికార్డు సాధించాడు. ప్రపంచశాంతి సందేశంతో రూపొందించిన ఆ ఎత్తైన శాంటా.. ఇండియాలోని ఒడిషా.. పూరీ బీచ్ లో సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. 2013 లో పట్నాయక్ తొలిప్రయత్నంగా 23 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఇసుకతో రూపొందించి, లిమ్కా రికార్డును చేజిక్కించుకున్నాడు. తాజాగా అదే శాంతి సందేశంతో 45 అడుగుల ఎత్తు, 75 అడుగుల వెడల్పు కలిగిన శాంటాక్లాజ్ సైకత శిల్పానికి రూపకల్పన చేశాడు. ఇరవైమంది సభ్యులతో, వెయ్యి టన్నుల ఇసుకతో సుమారు ఇరవై రెండు గంటలపాటు కష్టించి ఈ రంగు రంగుల శాంటాను నిర్మించారు. 45 అడుగుల ఎత్తైన ఈ శాంటా.. ఇప్పుడు గిన్నిస్ రికార్డును దక్కించుకోవడంతోపాటు... సందర్శకుల ప్రశంసలందుకుంటోంది. దీనికి తోడు ఏసుక్రీస్తు, మేరీమాతల శిల్పాలను కూడ రూపొందించి ప్రదర్శనకు ఉంచిన పట్నాయక్... అత్యంత ప్రేక్షకాభిమానాన్ని చూరగొంటున్నాడు. సందర్శకుల్లో అవగాహన పెంచే దిశగా గతంలో పట్నాయక్ ఎన్నో సైకత శిల్పాలకు ప్రాణం పోశాడు. ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్న ప్రస్తుత శాంటా ప్రదర్శన పూరీ బీచ్ లో జనవరి ఒకటి వరకూ కొనసాగుతుంది. -
పోలీసుల చొరవతో తీరిన బాలుడి ఆశ
ముంబై: 69 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముంబై పోలీసులు పదకొండేళ్ల బాలుడి ఆకాంక్షను నెరవేర్చారు. వీరి చొరవతో ఈ బాలుడు పోలీస్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకున్నాడు. నవీ ముంబైకి చెందిన జీత్ భానుశాలి కి పోలీసు అవ్వాలనే కోరిక ఉండేది. అయితే ఇక్కడ విషాదమేంటంటే భాను గత కొంతకాలంగా ప్రాణాంతకమైన హిమోఫిలియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక ఎంతో కాలం బతకడని వైద్యులు చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు 'మేక్స్ ఎ విష్ ఫౌండేషన్' ను సంప్రదించారు. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అతని ఆకాంక్షను నెరవేర్చేందుకు అంగీకరించారు. నవీ ముంబాయి అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ వాల్తేర్, వాషి పోలీస్ స్టేషన్ అధికారి అజయ్ కుమార్ దీనికి సంబంధించిన ఏర్పాటు చేశారు. పోలీసు అధికారిగా జీత్ ను గౌరవించారు. స్టేషన్ ఇంచార్జ్ దుస్తుల్లో ఉన్న జీత్‌కు సీనియర్ పోలీసులు స్టేషన్ పరిసరాలను చూపించారు. అతనిచే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయించారు. జీత్ తనకిష్టమైన పోలీస్ యూనిఫాంలో మురిసిపోయాడు. జెండాను ఆవిష్కరిస్తున్నఆ బాలుడి కళ్ళల్లో వెలుగు చూసిన పలువురి కళ్లు ద్రవించాయి. మేక్స్ ఏ విష్ ఫౌండేషన్ తన కుమారుడి కోరికను తీర్చడం ఎంతో ఆనందంగా ఉందని బాలుడి తల్లి పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత తన కుమారుడి కళ్లలో ఆనందం చూశానన్నారు. తన బిడ్డ కళ్లల్లో ఎనలేని ఆనందాన్ని నింపిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. -
క్యాన్సర్‌పై చైతన్యం కరువు
చెన్నై, సాక్షి ప్రతినిధి : ‘ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించాలి. దీనిపై చైతన్యం కరువైంది. ప్రజలకు ఎంతగా చెబుతున్నా చైతన్యం కలగడంలేదు’ అని చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ డాక్టర్ శాంత ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి పట్ల భయాన్ని వీడండి, చికిత్సతో సమూలంగా నివారించవచ్చు అంటూ 1954 నుంచి తాను ప్రచారం సాగిస్తున్నానని అన్నారు. అయినా ఇప్పటికీ క్యాన్సర్ సోకితే ప్రాణాలు పోవడం ఖాయమని కొందరు భావించడం శోచనీయమన్నారు. క్యాన్సర్ సోకిన వారెందరో చికిత్స చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తమ సంస్థ తరపున ఆగస్ట్ 2వ తేదీన నగరంలో చైతన్యసభ, 3వ తేదీన చెన్నై ఐలాండ్ మైదానం నుంచి 2కే, 4కే, 8కే రన్లను నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు. ఇందులో పాల్గొనేవారంతా క్యాన్సర్ బారి నుంచి బైటపడినవారేనన్నారు. తమ సంస్థకు బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హీరో సూర్య రన్లో పాల్గొంటాడని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పట్ల భయం పోగొట్టేందుకు 3 నెలల పాటు బస్సుల ద్వారా గ్రామాల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ సెల్వలక్ష్మీ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పెద్దవారికి మాత్రమే వస్తుందనే అపోహ నుంచి బైటపడాలని అన్నారు. ప్రస్తుతం పుట్టిన బిడ్డకు సైతం ఈ వ్యాధి సోకుతున్నందున అనుమానం వచ్చిన వెంటనే తగిన పరీక్షలు చేసుకుని నిర్ధారించుకోవాలని చెప్పారు. క్యాన్సర్ సోకడం గత జన్మలో చేసిన పాపం అనే మూఢనమ్మకాలను పెట్టుకోరాదన్నారు. తాము నిర్వహించే రన్‌కు అందరూ ఆహ్వానితులేనని, అయితే వచ్చేనెల 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం వల్ల భద్రతాకారణాల దృష్ట్యా ముందుగా తమ పేర్లను నమోదుచేసుకోవాలని అడ్మిన్ డైరక్టర్ డాక్టర్ వసంతన్ సూచించారు. నమోదు చేసుకోని వారిని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.