రెండు దశాబ్దాల్లోనే మారిన దశ.. నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం | Konaraopet: Bausaipeta Village Changed in Rajanna Sircilla District | Sakshi
Sakshi News home page

రెండు దశాబ్దాల్లోనే మారిన దశ.. నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం

Published Mon, Oct 3 2022 6:54 PM | Last Updated on Mon, Oct 3 2022 6:54 PM

Konaraopet: Bausaipeta Village Changed in Rajanna Sircilla District - Sakshi

బావుసాయిపేట ఊరిలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు.

సిరిసిల్ల: గోధూళి వేళ.. వ్యవసాయ పనులు ముగించుకుని అందరూ ఇళ్లకు చేరుతున్నారు.. సూర్యుడు అస్తమించాడు.. చీకటి కమ్ముకుంటుంది.. అంతలోనే కంజీరమోతలు.. ఎర్రెర్రని పాటలు.. ఆవేశపూరిత ప్రసంగాలు.. దోపిడీలేని సమాజం కోసం విప్లవించాలనే నినాదాలు.. ప్రజాకోర్టు.. ఊరిలోని అంశాలపై బహిరంగ చర్చలు.. లాల్‌ సలామ్‌ అంటూ.. వీడ్కోలు..!

మరసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు.. బూట్ల చప్పుళ్లతో ఊరు తెల్లవారింది.. ఆ పల్లెలోని వారిని ఊరు విడిచి వెళ్లకుండా కట్టడి. గ్రామ చావడి వద్దకు అందరిని చేర్చి ప్రజాదర్భార్‌. మేమున్నదే మీకోసం అంటూ అడవుల్లో తిరిగే వాళ్లకు మీరు అన్నం పెట్టొద్దు.. మొన్న వాళ్లకు అన్నం పెట్టిన వారు ఎవరో మాకు తెలుసు.. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం.. మీరు మాత్రం వాళ్లకు సహకరించొద్దు. చట్టం ఉందే మీకోసం.. అంటూ.. ఖాకీ డ్రెస్సుల పిలుపు..! ఇది రెండు దశాబ్దాల కిందట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కల్లా ప్ర జలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు.


ఊరు మారింది

ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు, ఇప్పటి స్థితిని అంచనా వేస్తే పల్లెలు ఎంతో మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల కోనరావుపేట మండలం బావుసాయిపేటను పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆ పల్లెకు వాహనయోగం వ చ్చింది. అప్పట్లో ఊరు మొత్తంలో మూడు, నాలు గు వాహనాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇంటికో బైక్, ఊరి నిండా ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు ఇలా ఎంతో మార్పు వచ్చింది. జిల్లాలోనే అత్యధి క కోళ్ల పరిశ్రమ ఆ గ్రామంలో విస్తరించింది. 20 కోళ్ల ఫారాలతో పౌల్ట్రీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఆ ఊరిలో పట్టణాల తరహాలో సూపర్‌మార్కెట్లు నడుస్తున్నాయి. ఒకప్పటి కల్లోల పల్లె ఇప్పుడు ప్రశాంతంగా ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. బావుసాయిపేట ఊరి జనాభా నాలుగు వేలు. ఓటర్ల సంఖ్య 2,740, వార్డులు పది. నివాసాల సంఖ్య 876. చిన్న ఊరే అయినా అభివృద్ధిలో అగ్రపథాన నిలుస్తుంది.


తీరొక్కటి దొరికే... సంత 

బావుసాయిపేటలో ప్రతీ బుధవారం జరిగే వారసంతలో తీరొక్క వస్తువులు దొరకుతాయి. చేపలు, రొయ్యలు మొదలు కొని బట్టలు, నిత్యసవరమైన వస్తువులు అన్నీ లభి స్తాయి. దీంతో కొండాపూర్, వెంకట్రావుపేట, బండపల్లి, గోవిందరా వుపల్లె గ్రామాల వాసులు వారసంతకు వచ్చి సరుకులు కొనుగోలు చేస్తారు. ఊరు శివారులో మూలవాగు, మరో రెండు చెరువులు ఉండడంతో భూగర్భజలాలకు కొదువ లేదు. వరి, పత్తి, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలను సాగుచేస్తారు. భూములు కొనుగోలు, విక్రయాలతో ఊరి ఆర్థికస్థితి మెరుగుపడింది. వ్యవసాయంలో బావుసాయిపేటలో అగ్రగామిగా నిలుస్తుంది. దీంతో గ్రామీణ ఆర్థికస్థితి ఎంతో బాగుపడింది. ఊరిలో రోడ్డుకు ఇరువైపులా ఉండే చెట్లు పల్లె అందాన్ని పెంచాయి.

ఎంతో మార్పు వచ్చింది
ఒకప్పటితో పోల్చితే ఊరిలో ఎంతో మార్పు వచ్చింది. రోడ్లు బాగుపడ్డాయి. రవాణా వసతి పెరిగింది. కమ్యూనికేషన్‌ పెరిగింది. ప్రజల జీవనంలోనూ మార్పు వచ్చింది. పట్టణాల్లో దొరికేవి అన్ని పల్లెల్లో అన్నీ లభిస్తున్నాయి.   
– బైరగోని నందుగౌడ్, చైతన్య యూత్, అధ్యక్షుడు

వేగంగా అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పల్లెల్లో అభివృద్ధి వేగంగా సాగుతుంది. అన్ని రంగాల్లో మార్పు వేగంగా జరిగింది. ఇంటింటా సెల్‌ఫోన్‌ యుగమైంది. గతంలో పోల్చితే.. పల్లె ముఖచిత్రం ఎంతో మారింది. కల్లోల పల్లెల్లో వ్యవసాయ విస్తరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది.                             
– కెంద గంగాధర్, గ్రామ సర్పంచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement