లవ్‌లీ కపుల్ ధనుంజయన్, శాంత
యాభై ఏళ్ల భార్యాభర్తల బంధం!
అబ్బ.. ఎంత ముచ్చటగా ఉంది!
ప్రేమ కలిపింది.
నాట్యం నిలిపింది.
ఎ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
నాట్యంతో మమేకమై జీవిస్తున్న దంపతులు అనగానే మనకు ఇక్కడ రాధారెడ్డి, రాజారెడ్డి గుర్తుకువస్తారు. ఆ దంపతులు కూచిపూడిని విశ్వవ్యాప్తం చేస్తుంటే, ఈ దంపతులు భరతనాట్యానికి మువ్వలుగా సందడి చేస్తున్నారు. ‘‘నేను శాంతను తొలిసారి చూసింది ‘కళాక్షేత్ర’లోని థియోసాఫికల్ గార్డెన్‌లో. అసలు కళాక్షేత్రలో నేను కలిసిన అమ్మాయి తనే. నాకు తమిళ్ రాకపోవడంతో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధతో నన్ను గైడ్ చేస్తుండేది. శాంతలో నాకు నచ్చిన లక్షణాలు చాలా ఉన్నాయి. తానెప్పుడూ ఏదో ఒక పనిలో ఉండేది. అయినా ముఖం మీద చిరునవ్వు చెరిగేది కాదు’’78 ఏళ్ల ధనుంజయన్ 74 ఏళ్ల శాంత గురించి చెప్పిన మాటలివి. వారిది అన్యోన్యమైన దాంపత్యం. వారి ప్రేమ అపూర్వం. వారి నాట్యరీతులు అమోఘం. యాభై ఏళ్లుగా వారిద్దరూ భరతనాట్యంలో ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. దేశవిదేశాల్లో దశాబ్దాలుగా వారి పాదాలు నర్తిస్తూనే ఉన్నాయి. ధనుంజయన్‌ది కేరళలోని కన్నూరు జిల్లాలో పయ్యనూర్. తండ్రి స్కూల్ టీచర్. అసలే పేద కుటుంబం, ఎనిమిది మంది సంతానాన్ని పోషించడానికి ఆయన జీతం సరిపోయేది కాదు. రెండు మూడేళ్లకోసారి బదిలీ. ఒక చోట కుదురుగా లేని బాల్యం ధనుంజయన్‌ది.
శాంతది మలేసియాలో స్థిరపడిన మలయాళీ కుటుంబం. నాట్యంలో, గానంలో చురుగ్గా ఉండేది. భరత నాట్యమంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ఎనిమిదేళ్ల వయసులో డాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
వీళ్లిద్దరినీ కలిపింది తమిళనాడులోని కళాక్షేత్ర నాట్యకేంద్రం. ధనుంజయన్‌కి భరతనాట్యం మీద ఉన్న ఆసక్తిని గమనించిన నాట్యగురువు కళాక్షేత్రకు రికమండ్ చేసి స్కాలర్‌షిప్‌తో సీటిప్పించారు. అలా ధనుంజయన్ పధ్నాలుగేళ్ల వయసులో కళాక్షేత్రలో అడుగుపెట్టారు. అప్పటికి ఓ ఏడాది ముందే శాంత.. కళాక్షేత్రలో చేరింది.
నాట్య బంధం!
నాట్య గురువులు చందు పణిక్కర్, రుక్మిణీదేవిల శిక్షణలో ధనుంజయన్, శాంతలు రాముడు –సీత అయ్యారు, అనిరుద్ధ– చంద్రలేఖలయ్యారు. ‘‘మా తొలి ప్రదర్శన సీతా స్వయంవరం. 1956లో కోయంబత్తూరులో ఇచ్చాం’’ అని ధనుంజయన్ గుర్తు చేసుకున్నారు. ‘ఆ నాట్యప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న స్టూల్ మీద చాలా సన్నిహితంగా కూర్చోవాల్సి వచ్చేది. అప్పుడు చాలా ఎంబరాసింగ్‌గా ఫీలయ్యాను. ఆ తర్వాత అదే స్టూల్‌ని ఇష్టంగా వాడేవాళ్లం’ అని గుర్తు చేసుకున్నారు శాంత.
పేదరికం ప్రేమను చంపేస్తుందా?
ధనుంజయన్, శాంత ఇద్దరూ భరతనాట్యం, కథాకళిలో డిస్టింక్షన్‌లో పాసయ్యి 1962లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. వీటితోపాటు ఆమె కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. శాంత కోర్సు పూర్తయిన తర్వాత మలేసియాకు వెళ్లిపోయారు. ధనుంజయన్‌కి మిగిలింది సస్పెన్సే. అప్పటికీ ఆయన తన ఫీలింగ్స్‌ని బయట పెట్టనేలేదు. తనలో మొగ్గతొడిగిన ప్రేమ.. ప్రేయసికి తెలియజేయకుండానే వడలిపోతుందా అని బెంగ. పేదరికం తన ప్రేమను చంపేస్తుందేమోనని ఆందోళన. ఇక్కడ ఇలా ఉంటే... మలేసియాలో శాంతకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు! ధనుంజయన్‌ని తప్ప ఎవరినీ తన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగాలేదామె. పెళ్లి చూపులు వద్దంటూ ఉండడంతో ఆమె పేరెంట్స్ అర్థం చేసుకుని ఇండియాకు వచ్చారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో 1966లో ధనుంజయన్‌కు, శాంతకు పెళ్లి చేశారు. శాంత.. భర్తతో కేరళలోనే ఉండిపోయింది, తల్లిదండ్రులు మలేసియాకి వెళ్లిపోయారు.
పెళ్లి సరే... బతికేదెలా?!
చేతిలో డాన్స్‌తోపాటు ఎకనమిక్స్‌లో పట్టా ఉంది. ఓ చిన్న కంపెనీలో క్లర్కు ఉద్యోగం వచ్చింది. అమ్మానాన్నలకు పంపించడానికి, తన ఇంటిని నడిపించడానికి ఒక భరోసా వచ్చింది. కానీ సంపన్న కుటుంబంలో పుట్టిన భార్యకు కనీస వసతులు కల్పించాలంటే ఆ జీతం ఏ మాత్రం సరిపోదు. అందుకే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డాన్సు క్లాసులు తీసుకునేవారు ధనుంజయన్. తాటాకు కప్పుతో చిన్న పాకలో ఆయన నాట్యగురువుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. క్రమంగా తమిళనాడుకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వారి డాన్స్ ఇన్‌స్టిట్యూట్ ‘భారత కళాంజలి’కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ రోజుల్లోకి వెళ్లిపోతూ, ‘‘శాంతను సంతోషంగా ఉంచడం మీదనే నా దృష్టి అంతా. వాళ్ల తల్లిదండ్రులది ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి నా కోసం వచ్చింది. ఆమె మాత్రం ఎటువంటి సౌకర్యాలనూ అడిగేది కాదు. అయినా ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు శాంతకు రాకుండా చూడడం నా బాధ్యత అన్నట్లు శక్తివంచన లేకుండా ప్రయత్నించేవాడిని. ఆమె ముందుచూపుతో మేము ఏర్పరుచుకున్న సామ్రాజ్యం ఇది’’ అంటారు ధనుంజయన్.
నాట్య ప్రయోగాలు!
భార్యాభర్తలిద్దరూ అప్పటి వరకు తాము నేర్చుకున్న నాట్యరూపకాలను ప్రదర్శించడంతో కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత కొత్త రూపకాలను పరిచయం చేశారు. నాట్యంలో యుగళగీతాన్ని ప్రవేశపెట్టారు. సంప్రదాయ అలరిప్పు స్థానాన్ని వారి ‘కళాంజలి’ పరిపూర్ణం చేసింది. ఆ దంపతుల అభినయం ‘నృత్యోపహారమ్’ రూపకాన్ని ఆవిష్కరించింది. వాటిని ఎల్లలు దాటించి విదేశాల్లోనూ వందలాదిగా ప్రదర్శించారు.
మనదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకూ తాము రూపొందించిన కొత్త రీతులను చూపించారు. ఖజురహో ఫెస్టివల్, రాష్ట్రపతి భవన్‌లో... ఇలా వేలాది ప్రదర్శనలు, లక్షలాది ప్రశంసలను అందుకున్నారు. పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డుతోపాటు పదులకొద్దీ అవార్డులు వారి సొంతమయ్యాయి. ఇన్ని ప్రశంసలలో తమను అత్యంత మురిపించిన ప్రశంస అమెరికాలోని అట్లాంటాలో ఏడేళ్ల బాలుడు తమకు ఇచ్చిందేనని అంటారు. ధనుంజయన్.
నాట్యమే ఊపిరి!
నాట్య ప్రదర్శనలు మొదలు పెట్టి యాభై ఏళ్లు దాటినా ఇంకా ఈ దంపతులలో ఆ స్ఫూర్తి ఏ మాత్రం తరగలేదు. ‘నాట్యం చేయకపోతేనే నిస్సత్తువ ఆవరిస్తుంది. నాట్యాన్ని శ్వాసిస్తూ జీవించాం, శ్వాస ఆగే వరకు నాట్యం చేస్తూనే ఉంటాం’ అన్నారు ధనుంజయన్. ‘నాట్యంలో శిఖరాలను చూసిన ఆనందాన్ని అనంతంగా ఆస్వాదిస్తున్నాం. ఇక మేము చేయాల్సిన పెద్ద బాధ్యత ఒకటుంది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోసం పెద్ద థియేటర్ నిర్మించాలి. సాంస్కృతిక నగరం చెన్నైలో నిత్యం కొత్త కళాకారులు పుట్టుకొస్తూనే ఉంటారు. వారికి ప్రదర్శనలకు అనువుగా ఒక వేదిక కావాలి. అది పూర్తయితే భరతనాట్యానికి మా వంతుగా తిరిగి ఇచ్చిన వాళ్లమవుతాం’ అన్నారు శాంత.
వొడాఫోన్ కపుల్
ధనుంజయన్, శాంత దంపతులకు సత్యజిత్ ఒక్కడే కొడుకు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. అదే రంగంలో కొనసాగాడు. కొడుకు సరదా కోసం వాళ్లు గోవాలో చిత్రీకరించిన వొడాఫోన్ అడ్వర్టయిజ్‌మెంట్‌లో నటించారు. అందులో ఈ దంపతులు సెకండ్ హనీమూన్‌కొచ్చిన కపుల్ అన్నమాట. అది డాన్సు ప్రధానంగా ఉన్న యాడ్ కావడంతో చేయడానికి ఒప్పుకున్నారు శాంత. ఆ తర్వాత మరో ఐదు యాడ్ ఫిల్మ్స్‌లో నటించినప్పటికీ వొడాఫోన్ యాడ్ తనకు చాలా ఇష్టమంటారు శాంత. ఆమె స్వతహాగా కూడా అడ్వంచర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడతారు. పారాసైలింగ్ ఆమె హాబీ. ఆ యాడ్‌లో ఆమె పారాసైలింగ్ చేశారు కూడా. అందుకే ఆ యాడ్‌ను అంతగా ఇష్టపడతారు.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment