సైకత శాంటాక్లాజ్ కు వరల్డ్ రికార్డ్!
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం అంత సులభం కాదు. అటువంటి రికార్డు పుటలకెక్కడం కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ప్రతిభను ప్రదర్శిస్తారు. తమలోని ప్రతిభకు పదును పెట్టి మరింత నైపుణ్యంతో ప్రదర్శించి రికార్డులకెక్కుతారు. అదే నేపథ్యంలో ఇప్పటికే ప్రఖ్యాత భారతీయ సైకత కళాకారుడుగా పేరొంది... ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నసుదర్శన్ పట్నాయక్... తాజాగా అతిపెద్ద శాంటా క్లాజ్ ను అత్యంత సుందరంగా తీర్చి దిద్ది ప్రపంచ రికార్డు సాధించాడు. ప్రపంచశాంతి సందేశంతో రూపొందించిన ఆ ఎత్తైన శాంటా.. ఇండియాలోని ఒడిషా.. పూరీ బీచ్ లో సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
2013 లో పట్నాయక్ తొలిప్రయత్నంగా 23 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఇసుకతో రూపొందించి, లిమ్కా రికార్డును చేజిక్కించుకున్నాడు. తాజాగా అదే శాంతి సందేశంతో 45 అడుగుల ఎత్తు, 75 అడుగుల వెడల్పు కలిగిన శాంటాక్లాజ్ సైకత శిల్పానికి రూపకల్పన చేశాడు. ఇరవైమంది సభ్యులతో, వెయ్యి టన్నుల ఇసుకతో సుమారు ఇరవై రెండు గంటలపాటు కష్టించి ఈ రంగు రంగుల శాంటాను నిర్మించారు. 45 అడుగుల ఎత్తైన ఈ శాంటా.. ఇప్పుడు గిన్నిస్ రికార్డును దక్కించుకోవడంతోపాటు... సందర్శకుల ప్రశంసలందుకుంటోంది. దీనికి తోడు ఏసుక్రీస్తు, మేరీమాతల శిల్పాలను కూడ రూపొందించి ప్రదర్శనకు ఉంచిన పట్నాయక్... అత్యంత ప్రేక్షకాభిమానాన్ని చూరగొంటున్నాడు.
సందర్శకుల్లో అవగాహన పెంచే దిశగా గతంలో పట్నాయక్ ఎన్నో సైకత శిల్పాలకు ప్రాణం పోశాడు. ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్న ప్రస్తుత శాంటా ప్రదర్శన పూరీ బీచ్ లో జనవరి ఒకటి వరకూ కొనసాగుతుంది.