న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుల అనంత్‌కుమార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
విలువైన సహచరుడిని కోల్పోయాను: మోదీ
అనంత్‌కుమార్ మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని.. విలువైన సహచరుడిని కోల్పోయానని అన్నారు. యువకుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ఆయన ఎంతో సేవ చేశారని తెలిపారు. అనంత్‌కుమార్ చేసిన మంచి పనులు ఆయనను చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తాయని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి ఆయన చాలా కష్టపడ్డారని కొనియాడారు. అనంత్‌కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఆయన భార్యను ఫోన్‌లో పరామర్శించారు.
కర్ణాటక ప్రజలకు తీరనిలోటు: రామ్‌నాథ్ కోవింద్
అనంత్‌కుమార్ మృతి చాలా బాధ కలిగించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆయన మృతి దేశ ప్రజలకు, ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు తీరనిలోటని తెలిపారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అనంత్‌కుమార్ మృతి షాక్‌కు గురిచేసింది: అమిత్ షా
అనంత్‌కుమార్ మృతి షాక్ గురిచేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఎంతో నిబద్ధతతో ఆయన దేశానికి సేవ చేశారని కొనియాడారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమించాడని అన్నారు. అనంత్‌కుమార్ కుటుంబానికి, సహచరులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి శక్తిని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్
అనంత్‌కుమార్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment