
న్యూఢిల్లీ: సంకుచిత ధోరణులు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రధాన అడ్డంకులుగా మారాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వినూత్న మార్గాల ద్వారా ఇలాంటి వాటిని అధిగమించి పాలనను వేగవంతం చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. పలు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 380 మంది డైరెక్టర్లు, డిప్యూటీ కార్యదర్శులతో మోదీ మంగళవారం సమావేశమై పలు విషయాలపై చర్చించినట్లు పీఎంఓ ప్రకటన విడుదల చేసింది. 2022 నాటికి నవభారత్ లక్ష్య సాధనకు అంకితభావంతో పనిచేయాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు.
‘సంకుచిత ఆలోచనా దోరణులు ప్రభుత్వ పాలనకు అడ్డంకిగా మారాయి. అధికారులు గిరిగీసుకోకుండా ఇలాంటి వాటిని వినూత్న మార్గాల ద్వారా అధిగమిస్తే పాలన వేగవంతమవుతుంది’ అని మోదీ అన్నారు. మెరుగైన ఫలితాలు రాబట్టాడానికి డైరెక్టర్, డిప్యూటీ కార్యదర్శి స్థాయి అధికారులు ప్రత్యేక బృందాలను నియమించుకోవాలని సూచించారు. పాలన, అవినీతి నిర్మూలన, ప్రభుత్వ సంస్థలు, గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, రవాణా, జల వనరులు, స్వచ్ఛ భారత్, కమ్యూనికేషన్, పర్యాటకం, తదితరాలు ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చినట్లు పీఎంఓ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment