
పరాయి నేలను ఆశించం
ఇతరుల కోసం త్యాగాలు చేసిన చరిత్ర భారత్‌ది
- ప్రవాసీ భారతీయ కేంద్రం ప్రారంభోత్సవంలో మోదీ
న్యూఢిల్లీ: ఇతరుల తరఫున పోరాడిన త్యాగ చరిత్ర భారత్‌దని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదని, ఇతరుల భూభాగాల్ని ఆక్రమించుకోవాలన్న దురాశ ఎప్పుడూ లేదని ఆదివారం ఢిల్లీలో ప్రవాసీ భారతీయ కేంద్రం ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల కోసం ఈ అత్యాధునిక కాంప్లెక్స్‌ను నిర్మించారు. ‘భారత్ ఎవరిపైనా దాడి చేయలేదు. ఇతరుల భూభాగాల కోసం దుశాశ లేదు. రెండు ప్రపంచ యుద్ధాల్లో (భారత్ ప్రత్యక్షంగా పాల్గొనక పోయినా)1.5 లక్షల మంది భారతీయ సైనికులు ఇతరుల కోసం ప్రాణత్యాగం చేశారు’ అని పేర్కొన్నారు. భారతీయులు గొప్ప త్యాగాలు చేసినా, వాటి గొప్పదనాన్ని ప్రపంచం గుర్తించేలా చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎప్పుడు విదేశాలకు వెళ్లినా... భారత సైనికుల స్మృతిచిహ్నాల్ని సందర్శించమంటూ చెపుతానన్నారు. ‘విదేశాల్లోని భారతీయులకు అక్కడి రాజకీయాల్లో ఆసక్తి లేదు. ఇతర వర్గాలతో వారు సులువుగా కలసిపోతారు. సాంఘిక ఉన్నత జీవనమే ప్రవాస భారతీయుల సిద్ధాంతం. ప్రవాస భారతీయులు నీళ్ల వంటి వారు... అవసరాన్ని బట్టి రంగు, ఆకారాన్ని మార్చుకోగలరు’ అని అన్నారు. ‘కొన్ని దేశాల్లో భారతీయ సమాజం...అక్కడి ఎంబసీలకంటే బలోపేతంగా ఉన్నాయి. భార త్ పట్ల తెలియని భయాల్ని తొలగించడంలో వారు సాయం చేయగలరు.విదేశాల్లోని భారతీయుల బలాన్ని ఒక్క తాటిపైకి తీసుకొస్తే మేధోవలసను పెంచవచ్చు. ఆనకట్టతో జల శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చినట్లు... 2.45 కోట్ల మంది ప్రవాసభారతీయుల శక్తిని వాడితే భారత్‌ను వెలిగించవచ్చు’అని ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్ భూకంప బాధితు లకు సాయం చేయడంలో, యెమెన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ,ఇతర దేశస్తుల్ని తరలించడంలో విదేశాంగ శాఖ చేసిన కృషిని మోదీ కీర్తించారు. ‘ఇతర దేశాలు ఇబ్బందుల్నుంచితమ ప్రజల్ని కాపాడాలని భారత్‌ను కోరుతున్నారు’ అనిపేర్కొన్నారు.
రైల్వేల అభివృద్ధిపై మేధోమథనం
రైల్వేలు లక్ష్యాల్ని అందుకునేలా రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు మోదీ రైల్వే ఉద్యోగులతో ముచ్చటించనున్నారు. 400 మందితో ప్రత్యక్షంగా, 20 వేల మందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నవంబర్ 25 నుంచి 27 వరకూ మేధోమథనసదస్సులో మోదీ పాల్గొంటారు.