మోదీ దౌత్యం భేష్!
ఆకస్మిక పర్యటనను స్వాగతించిన ఐరాస, అమెరికా, చైనా
♦ శాంతికి మోదీ చొరవతీసుకున్నారన్న అమెరికా మీడియా
♦ మంచి పరిణామం: పాక్ విపక్షాలు, మీడియా
♦ షరీఫ్ పాక్ ప్రజలను అవమానపరిచారు: హఫీజ్ సయీద్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మోదీ ఆకస్మిక పాక్ పర్యటన దౌత్యంపై భారత్‌లో విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. దాయాది దేశంతో స్నేహం కోసం అడుగుముందుకేసిన మోదీపై ఐక్యరాజ్యసమితితోపాటు పలు దేశాలు పొగడ్తలు కురిపిస్తున్నాయి. ‘ఆసియా దేశాల్లో శాంతిస్థాపనతోపాటు ఇరుగుపొరుగు దేశాలతో స్నేహం కోసం మోదీ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం’ అని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పేర్కొన్నారు. అటు అమెరికా కూడా మోదీ పాక్ పర్యటన.. ఉపఖండంలో ప్రజలకు మేలు చేస్తుందని తెలిపింది.
భారత్-పాక్ శాంతి చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు ఈ పర్యటన దోహదపడుతుందని, ప్రధానిగా పగ్గాలు చేపట్టాక మోదీ చేపట్టిన అతిపెద్ద దౌత్యవ్యూహం ఇదేనని అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. అటు చైనా కూడా మోదీ-షరీఫ్ భేటీని స్వాగతించింది. దక్షిణాసియాలో ముఖ్యదేశాలైన భారత్, పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు దోహదపడుతుందన్నారు. అటు పాకిస్తాన్ విపక్ష పార్టీలు కూడా మోదీ పర్యటనను స్వాగతించాయి. రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు కొత్త శకం ప్రారంభమైందని పేర్కొన్నాయి.
పాక్ మీడియా కూడా.. ఈ ఆకస్మిక పర్యటనలో ఇరుదేశాల ప్రధానుల మధ్య కశ్మీర్‌తోపాటు పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని పేర్కొంది. అయితే జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్ మాత్రం మోదీ పర్యటనను విమర్శించారు. ‘భారత ప్రధానికి ఘనస్వాగతం పలికిన పాక్ ప్రధాని.. దేశభక్త పాకిస్తానీల మనోభావాలు దెబ్బతీశారు’ అని విమర్శించారు. అయితే.. సయీద్ వ్యాఖ్యలకు ప్రాచుర్యం కల్పించొద్దని పాక్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఆదేశాలు జారీచేసింది.
వాజ్‌పేయి ఆలోచనతో ముందుకు: అద్వానీ
భారత్ పాక్ దేశాల మధ్య శాంతియుత వాతావరణం కోసం వాజ్‌పేయి ఆలోచనను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని.. బీజేపీ అగ్రనేత, కురువృద్ధుడు అద్వానీ అన్నారు. ఈ దిశగా మోదీ, అతని మంత్రివర్గ సహచరులు కృషిచేయాలని, ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. కాగా, ప్రధాని మోదీ లాహోర్ పర్యటన ఉపఖండ రాజకీయ, సామాజిక, ఆర్థిక సమీకరణాల్లో మార్పునకు దోహదపడుతుందని బీజేపీ పేర్కొంది. ‘మోదీ ధైర్యానికి, దూరదృష్టికి, ఉపఖండంలో మార్పుకు పునాది వేయటంలో నైపుణ్యానికి ఇదో మచ్చుతునక’ అని బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ అన్నారు.
అబ్ యహా ఆనా జానా లగా రహేగా: మోదీ
మోదీ: ఈ రాకపోకలు కొనసాగుతాయి.
షరీఫ్: తప్పకుండా.. ఇది మీ ఇల్లే
మోదీ: మీ కుటుంబం అంతా ఇక్కడే ఉంటుందా?
షరీఫ్: అవును 70-80మంది ఇక్కడే..
లాహోర్‌లో మోదీ, షరీఫ్ ముచ్చట
లాహోర్: ‘అబ్ యహా ఆనా జానా లగా రహేగా’(ఇకపై ఇక్కడికి రావటం వెళ్లటం కొనసాగుతుంది) మోదీ.. పాక్ పర్యటనలో ఆ దేశ ప్రధాని షరీఫ్‌తో అన్న మాటలివి. మోదీ శుక్రవారం కాబూల్ నుంచి భారత్‌కు తిరిగి వస్తూ అకస్మాత్తుగా లాహోర్‌లో విమానం దిగి షరీఫ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పడం తెలిసిందే. రెండు గంటలు లాహోర్‌లో గడిపిన మోదీకి, షరీఫ్ తన కుటుంబాన్ని పరిచయం చేసినప్పుడు ‘మీ కుటుంబమంతా ఇక్కడే ఉంటుందా?’ అని ప్రశ్నించారు. అందుకు.. ‘అవును 70-80మంది కుటుంబ సభ్యులు ఇక్కడే ఉంటారు’ అని షరీఫ్ జవాబు చెప్పారని ఆయన సన్నిహితులు తెలిపారు.
ఇక్కడికి ఇక రాకపోకలు కొనసాగుతాయని మోదీ అనగానే, ‘దానిదేముంది? ఇది మీ ఇల్లే’ అంటూ షరీఫూ సౌహార్దంగా అన్నారు. భారత్ పాక్ సంబంధాల్లో నాటకీయ పరిణామాలను చొప్పిస్తూ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా మోదీ లాహోర్ వెళ్లటం.. నవాజ్‌షరీఫ్‌కు 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలపటం తెలిసిందే. షరీఫ్ మనవరాలు మెహ్రున్నిసా వివాహం కూడా జరుగుతుండటంతో మోదీ ఆమెకు చీరను బహూకరించారు.