'సోలార్ మమ్మాస్' తో మోదీ భేటీ
ప్రధాని నరేంద్రమోదీ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా టాంజానియాలోని 'సోలార్ మమ్మాస్' తో భేటీ అయ్యారు. దారాస్ సలాస్ లోని అధ్యక్షభవనం సందర్శించిన అనంతరం ఆయన సౌర శక్తికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌర లాంతర్ల వినియోగం, మరమ్మత్తులపై అక్కడ శిక్షణ పొందిన మహిళలతో చర్చిచారు.
టాంజానియా పర్యటనలో భాగంగా సోలార్ మామాస్ తో భేటీ అయిన నరేంద్ర మోదీ... వారి శిక్షణా కార్యక్రమాల్లోని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరు దేశాలకు చెందిన 30 మంది గ్రామీణ మహిళలు శిక్షణ పొందుతున్న శిబిరంలో సౌర లాంతర్ల వినియోగం, మరమ్మత్తులపై ఆరా తీశారు. భారత్ సహాయ సహకారాలతో సౌర విద్యుత్ ఉత్పత్తిపై 'సోలార్ మామాస్' శిక్షణ తీసుకుంటారు.
ఆఫ్రికాలోని వివిధ దేశాలకు చెందిన సోలార్ ఇంజనీర్లకు అక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ శిక్షణ పొందుతున్న ఆఫ్రికన్ మహిళలను పలుకరించిన మోదీ... వారి నైపుణ్యాలు, సౌకర్యాలు వంటి అనేక విషయాలను గురించి వివరాలు తెలుసుకున్నారు. మోదీ సమావేశంలో భాగంగా శిక్షణ పొందిన మహిళలు వారు తయారు చేసిన సోలార్ వస్తువులను మోదీకి చూపించారు. దక్షిణాఫ్రికాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వారికి టాంజానియా లోని ప్రత్యేక కేంద్రంలో రాజస్థాన్ బేర్ ఫూట్ కళాశాల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు.