బెంగళూరు: ఐదేళ్లు కూడా నిండని ఆ చిన్నారి తల్లి కావాలని మారాం చేసింది. అమ్మ శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్లిందని తెలియక అమ్మ కావాలంటూ గుక్కపెట్టి ఏడ్చింది. ఆ చిట్టితల్లి ఏడుపును ఆపడం ఆమె తండ్రి తరం కాలేదు. అలా అని అమ్మను తీసుకురానూ లేడు. దీంతో ఆ పాపాయిని తీసుకుని తల్లి పని చేసే ఆసుపత్రికి వెళ్లాడు. అల్లంతదూరం నుంచే తల్లిని చూసి ఏడుపు లంకించుకుందీ చిన్నారి. కానీ ఆమెను ఓదార్చేందుకు తల్లి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బెల్గం ప్రాంతానికి చెందిన సుగంధ నర్సుగా పనిచేస్తోంది. ప్రస్తుతం కోవిడ్-19 పేషెంట్ల కోసం కేటాయించిన ఆసుపత్రిలో సేవలందిస్తోంది. ఆమె ఇంటికి వెళ్లక ఐదురోజులవుతోంది. దీంతో ఆమె నాలుగేళ్ల కూతురు తల్లిపై బెంగ పెట్టుకుంది. (ఇది మీకు కాస్తయినా నవ్వు తెప్పిస్తుంది: డాక్టర్లు)
అమ్మ కావాలని మంకు పట్టడంతో కుటుంబ సభ్యులు పాపాయిని ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లారు. దూరం నుంచే బైకు మీద కూచోబెట్టుకుని తల్లిని చూపించారు. ఆ పాపాయి ఏడుస్తూ.. వచ్చేయ్ అమ్మా.. అంటూ కన్నీళ్లతో అభ్యర్థించింది. దీంతో ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. దూరం నుంచే హాయ్ చెప్తూ తీసుకెళ్లిపోండి అంటూ కంటనీరు పెట్టుకుంది. ఆ చిన్నారి అమ్మను రమ్మని పిలుస్తూ గింజుకోవడం, గుండెలవిసేలా రోదించడం అందరి మనసులను కదిలించి వేస్తోంది. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. నర్సు అంకితభావాన్ని ప్రశంసిస్తూ, త్వరలోనే పరిస్థితులు చక్కబడుతాయని హామీ ఇ్చారు. (మానవత్వాన్ని చాటుకుంటున్న సామాన్యులు)
Comments
Please login to add a commentAdd a comment