ఢిల్లీలో ట్రా‘ఫికర్’
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ వర్షాలు కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో తీవ్ర మైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. నగరంలో 15.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వాహనాలు చాలా మెల్లగా ముందుకు కదిలాయి. ప్రధానంగా కూడళ్ల వద్ద వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ ఆగిపోయిందని చెబుతూ 150 మంది ఫోన్ చేశారని ఢిల్లీ ట్రాఫిక్ ప్రత్యేక కమిషనర్ సందీప్ గోయెల్ తెలిపారు. సాధారణ సమయంలో 30 నిమిషాల్లో చేరుకునే దూరానికి 3 గంటల సమయం పట్టిందని ఒక ప్రయాణికుడు తెలిపారు. జాతీయ రహదారి-8పై ఉన్న ఢిల్లీ-గుర్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ 8 కి.మీ. మేర నిలిచిపోయింది.
ట్రాఫిక్‌లో ఇరుక్కున్న జాన్ కెర్రీ
రెండో భారత్-అమెరికా వ్యూహాత్మక, వాణిజ్య చర్చల కోసం ఢిల్లీ వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. కెర్రీ విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్తుండగా సత్యమార్గ్ ప్రాంతంలో ఆయన తన కాన్వాయ్‌తోపాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.