సాక్షి, హైదరాబాద్: భవనం వైశాల్యం, నిర్మాణ ప్రత్యేకతల పరంగా దేశంలోనే అతిపెద్ద సచివాలయం. దేశంలో మరే ప్రభుత్వ భవనంపై లేనట్టుగా ఐదంతస్తులకు సరిపడా వైశాల్యంతో రెండు భారీ గుమ్మటాలు.. మంత్రిత్వ శాఖలకు సంబంధించి అన్ని విభాగాలు ఒకేచోట ఉండేలా ఏర్పాటు.. పీక్ అవర్స్‌లో ఆ భవనం చుట్టూ గంటకు 20 వేల వాహనాల ప్రవాహం.. నిత్యం వేల మంది సందర్శకులు వచ్చే ప్రాంగణం.. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసేందుకు వచ్చే వీఐపీలు.. అలాంటి కీలకమైన ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడితే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని దృష్టిపెట్టుకుని ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు రాకుండా రాష్ట్ర కొత్త సచివాలయం చుట్టూ విశాలమైన రహదారులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కొత్త రోడ్లను నిర్మించగా, మిగతా రోడ్లను విశాలం చేయటంతోపాటు మార్పుచేర్పులు చేస్తున్నారు.
నలువైపులా నాలుగు రోడ్లు..
సచివాలయం చుట్టూ 4 రోడ్లు సిద్ధమయ్యాయి. ఇప్పుడు వాహనాలు ఒకవైపు నుంచి వచ్చి ఒకవైపే వెళ్లే పరిస్థితి లేకుండా ఎటునుంచి ఎటైనా వెళ్లేలా రోడ్లను సిద్ధం చేశారు. కొత్త భవనాన్ని నిర్మించే సమయంలోనే రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఓ ప్రైవేటు సంస్థతో ట్రాఫిక్‌పై అధ్యయనం చేయించారు. కొన్ని రోడ్లు శాస్త్రీయంగా లేకపోవడంతో ట్రాఫిక్ అయోమయం కావడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారమిస్తుందని తేలింది. దీంతో వాటన్నింటిని సరిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆమేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
లుంబినీ వద్ద పాత రోడ్డును మూసేసి..
♦ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లుంబినీ పార్కువైపు వెళ్లే ప్రధాన రోడ్డు ప్రమాదాలకు ఆస్కారమిచ్చేలా ఉండటంతో లుంబినీ పార్కు వద్ద రోడ్డును మూసేశారు. సచివాలయ ప్రధాన ద్వారం ముందు నుంచి 110 అడుగుల వెడల్పుతో డబుల్ రోడ్డు నిర్మించారు. లుంబినీ వద్ద పాత రోడ్డును మూసేసి ట్రాఫిక్‌ను కొత్త రోడ్డుతో అనుసంధానించారు.
♦ బీఆర్‌కే భవనం వైపు మళ్లే చోట ఆదర్శనగర్ రోడ్డును వెడల్పు చేస్తున్నారు. అక్కడే ఉన్న కూడలిని మూసేసి వాహనాలకు ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద యూ టర్న్ ఆప్షన్ ఇచ్చారు.
♦ లక్డీకాపూల్ నుంచి వచ్చే రోడ్డును సచివాలయ భవనం వద్ద వెడల్పు చేశారు. ఇక్కడి పెట్రోలు బంకును కూడా తరలించి అక్కడి నుంచి నేరుగా అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లేందుకు వీలుగా రోడ్డును నిర్మించారు.
♦ సచివాలయ భవనం వెనక వైపు భవనాన్ని ఆనుకుని రోడ్డును వెడల్పు చేశారు. ఇక్కడే మసీదును నిర్మిస్తున్నారు. దానికి బయటి నుంచి కూడా జనం వచ్చేలా రోడ్డును సిద్ధం చేశారు.
♦ సచివాలయం–ఎన్టీఆర్ గార్డెన్స్ మధ్య (తెలంగాణ సచివాలయం పాత గేటు) ఉన్న రోడ్డును ఖైరతాబాద్ పెద్ద వినాయకుడిని ప్రతిష్టించే ప్రాంతం రోడ్డు వరకు వెడల్పు చేయనున్నారు.
♦ రోడ్లను ఇష్టమొచ్చినట్లు మార్చారని, కూడళ్లను మూసేశారని, ఇది వాహనదారులకు ఇబ్బందిగా ఉందన్న విమర్శలూ కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనని, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు తాజా మార్పులు దోహదపడతాయని అధికారులంటున్నారు.
సచివాలయానికి సరికొత్త రహదారులు
Published Sat, Apr 15 2023 3:53 AM | Last Updated on Sat, Apr 15 2023 3:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment