నగర యాతన
- చిన్నపాటి వర్షాలకే రోడ్లు ఛిద్రం
- గంటల తరబడి ట్రాఫిక్ జాం
- {పజలకు తప్పని కష్టాలు
- కానరాని పరిష్కార చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న సాధారణ వర్షాలకే రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఓ వైపు దెబ్బతిన్న రోడ్లు.. మరోవైపు మెట్రో పనుల్లో భాగంగా దారికి అడ్డంగా బారి కేడ్లు.. ఇవి కాక వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు...
వినాయక చవితి, వారాంతపు సెలవు తర్వాత సోమవారం రోడ్లపైకి భారీగా చేరిన జనం... వెరసి ఎక్కడ పడితే అక్కడ గంట లకొద్దీ వాహనాలు బారులు తీరాయి. రద్దీని చూసి ఆర్టీసీ డ్రైవర్ దారి మళ్లించడంతో కంగారుపడిన ఓ వ్యక్తి బస్సు నుంచి దూకే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. నేరేడ్‌మెట్‌లో మరో యువతి మృతి చెందింది. నిన్నమొన్నటి వరకూ వాన జాడ లేక అల్లాడిపోయిన జనం... ఈ చినుకులను చూసి సంతోషించాలో... లేక నగరంలో ఎదురయ్యే ఇబ్బందులతో బాధ పడాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్నారు.
మరో రెండు రోజులు వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే దుస్థితి నెలకొంది. ఏటా ఇవే దృశ్యాలు పునరావృతమవుతున్నా చక్కదిద్దే పనులు కనిపించడం లేదు. నాలుగు చినుకులకే గుంతలు తేలిన రోడ్లతో వాహనదారుల నడుములు విరుగుతున్నాయి. వర్షం వస్తే మన రోడ్ల గొప్పతనం తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లోని బాటిల్‌నెక్స్ వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. రహదారుల విస్తరణకు ప్రణాళికలు రూపొందించి ఏళ్లు గడుస్తున్నా కదలిక లేదు. భూసేకరణలో జాప్యం ఇందుకు ఒక కారణం కాగా, అధికారుల అశ్రద్ధ మరో కారణం.
ఎటు చూసినా అదే సీను
సోమవారం నగరంలో ఏ వైపు చూసినా బారులు తీరిన వాహనాలే. గంటల తరబడి ముందుకు కదల్లేని దుస్థితి.అటు నాగోల్ నుంచి ఇటు మెహదీపట్నం వరకూ... సికింద్రాబాద్ నుంచి మూసాపేట వరకూ అడుగడుగునా ట్రాఫిక్ జామ్. ఉప్పల్ చౌరస్తా, హబ్సిగూడ వీధి నెంబరు 8, ఐఐసీటీ, మెట్టుగూడ చౌరస్తా, శ్యాం లాల్ బిల్డింగ్, చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్, ఇమ్లిబన్, మూసాపేట-ఎర్రగడ్డ, సోమాజిగూడ, లక్‌డీకాపూల్, ముషీరాబాద్, రాజా డీలక్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్క్ రోడ్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు... జనమే జనం. ఏటా రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నా రోడ్ల దుస్థితిలో మార్పు లేదు.
ఖర్చు ఘనం...
ఈ ఏడాది ఇప్పటి వరకు రోడ్ల కోసం రూ.వంద కోట్లకు పైగా ఖర్చు చేశారు. రంజాన్, బోనాలు వంటి పండుగల పేరిట, పాట్‌హోల్స్ మరమ్మతుల పేరిట ఖర్చు చేశారు. అయినా పరిస్థితి షరా మామూలే. వర్షాకాలం కావడంతో రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలానికి ముందే పూర్తి స్థాయి మరమ్మతుల్లో విఫలమవుతున్నారు. దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.
గడువుకు ముందే ...
నగర రోడ్లపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల భారం.. వివిధ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం.. ప్రజల బాధ్యతారాహిత్యం వెరసి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ఐదేళ్లు మన్నిక ఉండాల్సిన బీటీ రోడ్లు రెండేళ్లు కూడా నిలవడం లేదు. దాదాపు 25 ఏళ్లు నిలవాల్సిన సీసీరోడ్లు అందులో సగం రోజులు కూడా ఉండటం లేదు. వాటర్‌బోర్డు, టెలికాం, విద్యుత్ శాఖలు తమ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతుండటంతో త్వరితంగా పాడవుతున్నాయి.