బీజేపీ నేత కారులో.. రూ. 20 లక్షల కొత్త నోట్లు!
బీజేపీ నేత కారులో.. రూ. 20 లక్షల కొత్త నోట్లు!
Published Sat, Dec 3 2016 8:59 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
తమిళనాడులో ఒక బీజేపీ యువ నాయకుడి కారులో రూ. 20 లక్షల విలువైన నగదు పట్టుబడింది. అందులో 900కు పైగా 2000 రూపాయల నోట్లున్నాయి. సేలం జిల్లా బీజేపీ యువజన విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న జేవీఆర్ అరుణ్.. తన ఫేస్‌బుక్ పేజీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. మన దేశ ప్రగతి కోసం క్యూలైన్లలో నిలబడదామని కూడా పిలుపునిచ్చారు. అయితే, సేలం జిల్లాలో జరుగుతున్న సాధారణ చెకింగ్‌లోనే ఆయన పట్టుబడ్డాడు. ఆయన కారులోంచి రూ. 20.5 లక్షల విలువైన నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాటిలో 2000 రూపాయల నోట్లు 926, 100 రూపాయల నోట్లు 1530, 50 రూపాయల నోట్లు 1000 చొప్పున ఉన్నాయి. మొత్తం నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ట్రెజరీలో డిపాజిట్ చేశారు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందన్న విషయాన్ని అరుణ్ సంతృప్తికరంగా చెప్పలేకపోయారు. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలిపారు. బ్యాంకు అధికారులు ఎవరైనా అతడికి సహకరించారా, లేదా కమీషన్ పద్ధతిలో ఆ నోట్లు తీసుకున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ బీజేపీ రాష్ట్రశాఖ అరుణ్‌కు షోకాజ్ నోటీసు జారీచేసింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
Advertisement