
జేఎన్‌యూ ఘటనలో ఏబీవీపీకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి క్లీన్‌చిట్ ఇచ్చారు.
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఆదివారం సాయంత్రం ముసుగు దుండగులు విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన ఘటనలో దర్యాప్తు సాగుతుండగానే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీవీపీకి క్లీన్‌చిట్ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అనుబంధ సంస్ధలకు హింసకు పాల్పడేంతటి శక్తిసామర్థ్యాలు లేవని చెప్పుకొచ్చారు. విద్యార్ధుల భవితవ్యంతో చెలగాటం వద్దని కాంగ్రెస్, ఆప్‌లకు హితవు పలికారు.
పరీక్షలకు హాజరయ్యే వారిని అడ్డుకోవద్దని జేఎన్‌యూ విద్యార్ధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. జేఎన్‌యూ ఘటనపై విచారణ సాగుతోందని త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.మరోవైపు జేఎన్‌యూ దాడికి తమదే బాధ్యతని హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జేఎన్‌యూ కమ్యూనిస్టులకు అడ్డాగా మారిందని, జాతి వ్యతిరేక..హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వారు పాల్పడుతున్నందునే తమ కార్యకర్తలు క్యాంపస్‌లోకి చొచ్చుకువచ్చి దాడులు జరిపారని ఆ సంస్ధ నేత తోమర్ ఓ వీడియోలో వెల్లడించారు.