జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన | Violence at JNU campus on JNUSU president injured in attack | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన

Published Tue, Jan 7 2020 4:07 AM | Last Updated on Tue, Jan 7 2020 5:13 AM

Violence at JNU campus on JNUSU president injured in attack - Sakshi

జేఎన్‌యూలో జరిగిన దాడికి నిరసనగా ముంబైలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై ఆదివారం ముసుగు దుండగులు చేసిన విచక్షణారహిత దాడిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో విదేశీ యూనివర్సిటీల్లోనూ సోమవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అధికార, విపక్ష నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అడ్డుకునే విషయంలో అసమర్ధంగా వ్యవహరించారని యూనివర్సిటీ వైస్‌ చాన్సెలర్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని, కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించామని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయని క్రైమ్‌ బ్రాంచ్‌ వెల్లడించింది.  ముసుగులు వేసుకుని జేఎన్‌యూ క్యాంపస్‌లోకి వచ్చిన దుండగులు ఆదివారం రాత్రి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలోయూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ సహా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం వారిని సోమవారం ఉదయం డిశ్చార్జ్‌ చేశారు. కాగా, ఈ హింసకు బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీదే బాధ్యత అని విపక్షాలు, యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించాయి. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో జేఎన్‌యూలో పరిస్థితిని సమీక్షించారు. మోదీ ప్రభుత్వ సహకారంతో గూండాలు దేశ యువతపై జరిపిన ఈ దాడి అత్యంత గర్హనీయమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు.  

జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌

అంధుడిపైనా వీరంగం
కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో ముసుగులు ధరించిన గూండాలు విచ్చలవిడిగా దాడి చేశారని బాధితులు తెలిపారు. ‘మేం హాస్టల్లో ఉండగా, ఏబీవీపీ వారు కర్రలతో వస్తున్నారని ఎవరో అరిచారు. దాంతో మేం రూంలోకి వెళ్లి లోపలి నుంచి తలుపేసుకున్నాం. అయినా, వారు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేయసాగారు. దాంతో బాల్కనీ ద్వారా ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి కిందకు దూకాం’ అని కశ్మీర్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపారు.

అంధుడినని కూడా చూడకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని సూర్యప్రకాశ్‌ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలువురు విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. గూండాల దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మహిళల వసతి గృహంపైనా దుండగులు దాడికి తెగబడ్డారు. ‘క్యాంపస్‌లో జరిగిన శాంతి ర్యాలీలో పాల్గొంటుండగా.. 20–25 మంది దుండగులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నాపై ఐరన్‌ రాడ్లతో దాడి చేశారు’ అని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ వివరించారు. తనపై దాడి చేసినవారిని గుర్తుపడతానన్నారు.

తమకు వ్యతిరేకులైన వారిని గుర్తించి మరీ దాడికి పాల్పడ్డారని, ఇది ఏబీవీపీ దౌర్జన్యమేనని ఘోష్‌ ఆరోపించారు. ‘మా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు గత 4, 5 రోజులుగా ఆరెస్సెస్‌తో సంబంధాలున్న పలువురు ప్రొఫెసర్లు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే, వారి ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది’ అని ఘోష్‌ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో జేఎన్‌యూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ‘జేఎన్‌యూ సెక్యూరిటీ సహకారంతోనే ఆ గూండాలు రెచ్చిపోయారు. ఫోన్‌ చేసిన 2 గంటల తరువాత పోలీసులు వచ్చారు’ అని ఆయిషీ ఘోష్‌ ఆరోపించారు. తమపై వచ్చిన ఆరోపణలను ఏబీవీపీ ఖండించింది.

దేశవ్యాప్తంగా నిరసనలు
జేఎన్‌యూలో విద్యార్థులపై దాడిని విద్యార్థిలోకం తీవ్రంగా పరిగణించింది. పుదుచ్చేరి నుంచి చండీగఢ్‌ వరకు.. అలీగఢ్‌ నుంచి కోల్‌కతా వరకు వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై, ఢిల్లీ యూనివర్సిటీ, అంబేద్కర్‌వర్సిటీ, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీ, చండీగఢ్‌ యూనివర్సిటీ, సావిత్రీబాయి ఫూలె యూనివర్సిటీ, పంజాబ్‌ యూనివర్సిటీ, జాదవ్‌పూర్‌ వర్సిటీసహా పలు విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులోని నేషనల్‌ లా యూనివర్సిటీ, ఐఐటీ– బాంబే, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌(పుణె) తదితర విద్యా సంస్థల్లోనూ విద్యార్థులు నిరసన తెలిపారు. ముంబైలో ఆదివారం అర్ధరాత్రి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద  నిరసన తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ యువజన విభాగం టార్చ్‌లైట్స్‌ మార్చ్‌ నిర్వహించారు.

విదేశాల్లో..
నేపాల్‌లోని కఠ్మాండూలో జేఎన్‌యూ పూర్వ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే, బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, ససెక్స్‌ యూనివర్సిటీల్లో, అమెరికాలోని కొలంబియా వర్సిటీలో విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.

వీసీపై ఆరోపణలు
దాడి విషయంలో సకాలంలో స్పందించకపోవడంపై యూనివర్సటీ వైస్‌చాన్స్‌లర్‌ జగదీశ్‌ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. జేఎన్‌యూ అధికారులతో సోమవారం మానవ వనరుల శాఖ జరిపిన సమీక్ష సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వీసీ రాజీనామా చేయాలని జేఎన్‌యూఎస్‌యూ, జేఎన్‌యూ టీచర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేశాయి. వీసీ గూండాల నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, యూనివర్సిటీలో హింసకు ఆయనదే ప్రణాళిక అని ఆరోపించాయి. దుండగులు ప్రొఫెసర్ల నివాస సముదాయాలపైనా దాడి చేసి, మహిళలను దుర్భాషలాడారని పలువురు టీచర్లు తెలిపారు.  

దాడిలో ఏబీవీపీ హస్తం?
జేఎన్‌యూలో దాడికి, బీజేపీ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ)కి సంబంధం ఉన్నదని సూచించే పలు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ దాడిలో పాల్గొన్నవారిలో జేఎన్‌యూ ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు వికాస్‌ పాటిల్‌ ఉన్నట్లు భావిస్తున్నారు. లాఠీలు, ఇనుపరాడ్లు పట్టుకుని ఉన్న కొందరు వ్యక్తులతో వికాస్‌ ఉన్న ఒక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. క్యాంపస్‌లో ఢిల్లీ పోలీసులకు దొరికిన ఫైబర్‌ గ్లాస్‌ లాఠీ లాంటి దానినే పాటిల్‌ పట్టుకుని ఉన్నారు. ఫొటోలో అతని పక్కన ఉన్న వ్యక్తిని ఏబీవీపీకి చెందిన శివపూజన్‌ మండల్‌గా గుర్తించారు. ఇతను జేఎన్‌యూలో బీఏ తొలిఏడాది చదువుతున్నాడు.

కర్రలతో వికాస్‌ పాటిల్‌. శివపూజన్‌ మండల్‌. యోగేంద్ర (ఇన్‌సెట్లో)

పాటిల్, మండల్‌ ఇద్దరూ తమ సోషల్‌ మీడియా అకౌంట్లను డిలీట్‌ చేయడం గమనార్హం. జేఎన్‌యూ క్యాంపస్‌లో వామపక్ష విద్యార్థులపై దాడి చేయాలంటూ వాట్సాప్‌లో జరిగిన చర్చకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ‘వామపక్ష  విద్యార్థులపై భౌతిక దాడికి దిగాలి. అదొక్కటే పరిష్కారం’ అని, ‘మేం ఇక్కడ 25 నుంచి 30 మంది వరకు ఉన్నాం’ అని అందులో ఉన్నాయి. ఈ చాట్‌లో పాల్గొన్న వారిలో జేఎన్‌యూలో సంస్కృతంలో పీహెచ్‌డీ చేస్తోన్న విద్యార్థి యోగేంద్ర భరద్వాజ్, మరో పీహెచ్‌డీ విద్యార్థి సందీప్‌ సింగ్‌ ఉన్నారు. భరద్వాజ్‌ ఇప్పటికే తన ఇతర సోషల్‌ మీడియా అకౌంట్లను డిలీట్‌ చేసినప్పటికీ, ఆయన ట్విటర్‌ అకౌంట్‌ ప్రొఫైల్‌ ద్వారా అతడు ఏబీవీపీ సభ్యుడని గుర్తించారు.

బయటివారా? లోపలి వారా?
జేఎన్‌యూలో ఆదివారం హింసకు పాల్పడింది వర్సిటీ విద్యార్థులా? లేక బయటినుంచి వచ్చిన వ్యక్తులా? అనే విషయంపై ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ దృష్టి సారించింది.  ‘ఆదివారం మధ్యాహ్నం నుంచే వర్సిటీ గోడలు, గేట్ల వద్ద భారీగా పోలీసు వాహనాలు కనిపించాయి. ఆ స్థాయిలో పోలీసులున్నా దుండగులు క్యాంపస్‌లోకి ఎలా రాగలిగారు? క్యాంపస్‌లో దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఇంటలిజెన్స్‌ సమాచారం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే.. వారెందుకు వెంటనే స్పందించలేదు?’ అనే ప్రశ్నలను పలువురు సంధిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఒకరు స్పందించారు.

‘గత నెల రోజులుగా పోలీసులు జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉంటున్నారు. అలాగే, ఆదివారం కూడా అక్కడ ఉన్నారు. వర్సిటీ అధికారుల అనుమతి లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులు వెళ్లలేరు’ అని వివరించారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి విద్యార్థులు చాలా కోపంగా ఉన్నారని, పోలీసులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారమివ్వడంలో ఆలస్యం కావడంపై వర్సిటీ అధికారులు స్పందించారు. ‘సరైన కారణం లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులను పిలిస్తే విద్యార్థులకు కోపమొస్తుంది. అందుకే పరిస్థితి దిగజారిందని భావించాకే పిలిచాం’ అని తెలిపారు.

విద్యార్థులపై మోదీ ప్రభుత్వ మద్దతుతో జరిగిన అమానుష దాడి ఇది. విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి.

– సోనియా గాంధీ, కాంగ్రెస్‌ చీఫ్‌
 
ఈ దాడులు 26/11 ముంబై దాడులను గుర్తు చేస్తున్నాయి. దేశంలో తమకు రక్షణ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనల వంటి వాటిని మహారాష్ట్రలో జరగనివ్వను. నిందితులను పోలీసులు పట్టుకోలేకపోతే.. వారూ అందులో పాలుపంచుకున్నట్లే..


– ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

 
జేఎన్‌యూ దాడిపై బాలీవుడ్‌ నటి, అక్షయ్‌కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా స్పందించారు.


వార్తా పత్రికలోని ఓ భాగాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘భారత్‌.. ఇక్కడ విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఇది భయానికి వెరవడం లేదు. నిరసనలను హింసతో అణచలేరు. అదే జరిగితే మరింత మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతారు’ అని చెప్పారు. అయితే దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ మాటలను ఏబీవీపీకి మద్దతుదారుడైన అక్షయ్‌ కుమార్‌కు (ట్వింకిల్‌ భర్త) చెప్పాలంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement