ఢిల్లీ:అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్‌లలో సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆమెను సెబీ ఛైర్ పర్సన్‌గా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమెను ఛైర్మన్ పదవి నుంచి తొలిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 22 దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు భైఠాయించి నిరసనలు తెలుపుతాం. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదానీ గ్రూప్, సెబీకి సంబంధించిన అతిపెద్ద కుంభకోణంపై చర్చించాం. అదానీ మెగా స్కామ్‌పై జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment