రోజుకి నాలుగు గంటలు యాప్‌ల్లోనే..
న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ యూజర్స్ రోజుకు 4 గంటలు యాప్‌లతోనే గడుపుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. యాప్ అనలైటిక్స్ సంస్థ ‘యాప్ అన్నీ’ 9 దేశాల్లో జరిపిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మొబైల్ యూజర్స్ ఎక్కువగా ఉండే భారత్, సౌత్‌కొరియా, మెక్సికో, బ్రెజిల్, జపాన్, అమెరికా, యూకేలో అన్నీ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ దేశాల్లో ఎక్కువగా, మధ్యస్థంగా, మాములుగా మొబైల్ ఉపయోగించే వారిని మూడు విభాగాలుగా విభజించి సర్వే నిర్వహించారు. ఎక్కువగా ఉపయోగించేవారు రోజుకు నాలుగు గంటలు యాప్స్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
ఇక మధ్యస్థంగా మొబైల్ వాడే వారు బ్రెజిల్‌లో రోజుకు మూడు గంటలు, భారత్‌లో రెండున్నర గంటలు యాప్స్‌తోనే గడుపుతున్నారని తెలిపింది. ఇక మాములుగా మొబైల్ ఉపయోగించేవారు గరిష్టంగా యాప్‌లను గంటన్నర ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఎక్కువగా ఆండ్రాయిడ్ మెబైల్ యాప్స్‌నే ఉపయోగిస్తున్నట్లు అన్నీ సంస్థ ప్రకటించింది.