
న్యూఢిల్లీ : 2019 ఏడాదికి సంబంధించి ఇండియాలోనే అత్యంత శక్తివంతమైన ప్రముఖుల జాబితాను ఇండియా టుడే మ్యాగజైన్ వెల్లడించింది. ఆగస్టులో వెలువడనున్న ఇండియా టుడే మ్యాగజైన్‌లో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సినిమా, క్రీడా మొదలైన రంగాలలో అత్యంత శక్తివంతులను ప్రాతిపదికగా ఎంచుకొని జాబితాను ప్రచురించింది. కాగా ఈ జాబితాలో 27 మంది వ్యాపారవేత్తలు, మహిళలు చోటు సంపాదించగా ఇందులో 22మంది గతేడాది చోటు సంపాదించిన వారే కావడం విశేషం.
ఇక జాబితా విషయానికి వస్తే మొదటి 50 శక్తివంతమైన ప్రముఖలలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన కేవలం ఒక్క ఏడాదిలోనే 25 శాతం సంపదను పెంచుకున్నట్లు ఫోర్బ్స్ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. బిర్లా గ్రూఫ్ చైర్మన్ కుమారం మంగళం బిర్లా ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలవడం విశేషం. ఇక మూడవ స్థానంలో అదాని గ్రూఫ్ అధినేత గౌతమ్ అదానీ, కొటక్ మహీంద్ర బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కొటక్, మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా వరుసగా నాలుగు,ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. ఇక టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత నటరాజన్ చంద్రశేఖరన్(టీసీఎస్), బిగ్‌బి అమితాబ్ బచ్చన్, హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్ నాడార్‌లు వరుసగా 8,9,10 వస్థానాల్లో నిలిచారు.
కాగా రాజకీయ రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకునిగా మొదటి స్థానాన్ని ఆక్రమించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆయన ఒంటిచేత్తో తిరుగులేని మెజార్టీతో ఎన్డీయేను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చిన విషయం ఎవరూ మరిచిపోలేరు. ఇక, ఈ జాబితాలో మొదటి 10 మందిలో తొమ్మిది మంది బీజేపీకి చెందిన నేతలే ఉండడం గమనార్హం.
ఈసారి జాబితాలో మహిళలకు కూడా పెద్ద ఎత్తున చోటు లభించడం విశేషం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, ఏక్తా కపూర్, మోనికా షెర్గిల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
ఇక సినీ ప్రముఖుల విషయానికి వస్తే బిగ్‌బి అమితాబ్ బచ్చన్(09), ‘ఖిలాడి’ అక్షయ్‌కుమార్(21), రణ్‌వీర్ సింగ్(27), కండల వీరుడు సల్మాన్‌ఖాన్(29), దీపికా పదుకొనే(42), నిర్మాత ఏక్తా కపూర్(48) జాబితాలో స్థానం సంపాదించారు. కాగా, తొలి 50 మంది ప్రముఖలు జాబితాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్(17), ఈశా పౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్(40) చోటు సంపాదించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment