భోపాల్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ)కి చెందిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన, జంగ్ పురా నియోజకవర్గం నుంచి గెలుపొందిన ప్రవీణ్ దేశ్ ముఖ్ తండ్రి పీఎన్ దేశ్ ముఖ్(55) మధ్యప్రదేశ్ లోని భోపాల్ దగ్గరలోని జిన్సీలో టైర్ పంక్చర్ షాపు నడుపుకుంటు జీవనం సాగిస్తున్నారు. పార్లమెంటరీ సెక్రటరీ వ్యవహారాల నుంచి విద్యాశాఖను చూసే ప్రవీణ్ పై కూడా ‘ఆఫీస్ ఆఫ్ ఫ్రాఫిట్’ కింద ఆఫీస్ స్పేస్ కింద అసెంబ్లీ స్పీకర్ ద్వారా రూమ్ లు కేటాయించుకున్నారని బీజేపీ, కాంగ్రెస్ లు ఆరోపించాయి. దీన్ని ఖండించిన ఏఏపీ ఎమ్మెల్యేలు వాటిని కొట్టిపారేశారు. తాము విధుల్లోకి వచ్చిన నాటి నుంచి ఎటువంటి జీతభత్యాలను స్వీకరించకుండా పనిచేస్తున్నామని ప్రవీణ్ తెలిపారు.
ఈ విషయం స్పందించిన ప్రవీణ్ తండ్రి తనకు గానీ తన కుటుంబంలో ఏ ఒక్కరికీ గానీ అధికారం చేతిలో ఉందన్న గర్వం లేదని అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి అద్దెకు ఓ ఫ్లాట్ లో నివసిస్తున్నట్లు తెలిపారు. మేం జీవించే జీవనంలో కూడా ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. మొదట ప్రవీణ్ ఎమ్మెల్యే అయినప్పుడు తాను ఆనందించినట్లు ఏడాది తర్వాత అతని సింపుల్ జీవితాన్ని, ఢిల్లీలో విద్యను అందించడానికి చేసిన కృషిని చూసి గొప్పగా ఫీలయినట్లు వివరించారు. డబ్బుకోసమే ఇదంతా చేసి ఉంటే పెద్ద కంపెనీలో రీజనల్ మేనజర్ ఉద్యోగాన్ని ప్రవీణ్ వదులుకునేవాడు కాదని అన్నారు. ఒక ఎమ్మెల్యే డిస్ క్వాలిపై అయినా, ప్రవీణ్ సామాజిక సేవ చేస్తాడని ఆయన తేల్చి చెప్పారు.